వంద శాతం గిరిజనులున్న చోట బీసీ రిజర్వేషన్
బీసీలు అధికంగా ఉండి గిరిజనుల్లేని జీపీలు ఎస్టీలకు కేటాయింపు
ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతర రిజర్వేషన్లు
ప్రణాళికల్లేని రొటేషన్ పద్ధతే కారణం
రిజర్వేషన్ల పుణ్యమా అని అనేక చోట్ల ఏకగ్రీవాలకు చాన్స్
ఆశావహులు అత్యధికుల్లో నిస్తేజం
జనరల్ కేటగిరికి గణనీయంగా తగ్గిన స్థానాలు
మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచరుల ఒత్తిడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకటించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారితీస్తున్నాయి. వెనుకబడిన వర్గానికి చెందిన ఓటర్ ఒక్కరూ లేని తండాల్లో సర్పంచ్ స్థానాన్ని బీసీకి రిజర్వ్ చేశారు. గిరిజనుల్లేనిచోట ఎస్టీలకు కేటాయించారు. ఒకటి, రెండు చోట్ల వంద శాతం బీసీలు ఉండగా ఆ గ్రామాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు రిజర్వ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులకు కేటాయించటం పట్ల ఎస్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గిరిజనులకే రిజర్వేషన్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) డిమాండ్ చేస్తోంది. రిజర్వేషన్ల గందరగోళం పుణ్యమా అని అనేక మంది ఆశావహుల భవితవ్యాలు తారుమారయ్యాయి.
ఎప్పటి నుంచో పోటీ చేయాలని తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వారిలో రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో ఇప్పుడు అయోమయ స్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 8వ తేదీన వెలువడే హైకోర్టు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు సందిగ్ధత వీడి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే రిజర్వేషన్లపై పలువురు కోర్టుకు వెళ్లే ఆలోచనలోనూ ఉన్నారు. రిజర్వేషన్లు సవరించేలా చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలపై కొందరు ఆశావహులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రభుత్వ యోచన మంచిదే అయినా అశాస్త్రీయంగా రిజర్వేషన్ల కేటాయింపులు ఉండటం విమర్శలకు తావిస్తోంది.
ప్రణాళిక లేని రొటేషన్ పద్ధతే కారణం
ప్రణాళిక లేని రొటేషన్ పద్ధతి కారణంగానే సంబంధిత వర్గానికి చెందిన అభ్యర్థులు లేని చోట ఆ వర్గానికి కేటాయింపులు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణన సర్వే లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం 2018 నాటి రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుని రొటేషన్ పద్ధతిని అనుసరించటం వల్ల కొన్నిచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు వలసపోవటం కూడా కారణంగా చూపుతున్నారు. పదేండ్ల క్రితం నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవటం, రొటేషన్ పద్ధతి అమలు చేయటం వల్ల ఇలాంటి గందరగోళ స్థితి నెలకొందని భావిస్తున్నారు. జిల్లాకో తీరుగా.. రెవెన్యూ డివిజన్‌కో తీరుగా కేటాయింపులు చేయటం వల్లనే ఇలాంటి చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామీణ ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అధికారుల తిలోదకాలు!
రిజర్వేషన్ల ఖరారులో అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే స్థానాలను నిర్ధారించాలని ప్రభుత్వం సూచించింది. బీసీలకు మాత్రం 42శాతం రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జడ్పీ చైర్మెన్ స్థానాలకు పంచాయతీరాజ్ కమిషనర్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆర్డీవోలు, వార్డుమెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ణయించాలో కూడా ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. సాధారణంగా సగం కంటే ఎక్కువ ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. షెడ్యూల్డ్ ఏరియాలో ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా చూడాలి. వందశాతం ఎస్టీ జనాభా ఉంటే మొత్తంగా వారికే కేటాయించాలి.
కానీ అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఆశావహులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. గణనీయంగా జనరల్ స్థానాలు తగ్గటంతో ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. రిజర్వేషన్‌లో మార్పు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలు సైతం చేపడుతున్నారు. పోటీపై ఆసక్తితో ఉన్న కొందరు రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్‌కు బదులు ఎంపీటీసీగా పోటీ చేయాలని, అది కూడా వీలుకాకపోతే మండల పరిధిలో వీలైన చోట ఎంపీటీసీకి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 8వ తేదీ కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకోవాలని.. అవసరమైతే కోర్టును సైతం ఆశ్రయించాలని నిశ్చయించుకున్నట్టు పలువురు చెబుతున్నారు. రిజర్వేషన్లు తారుమారవటంతో రాష్ట్రంలో అనేక స్థానాలు ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.
రిజర్వేషన్ల గందరగోళంపై మచ్చుకు కొన్ని..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 37 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 13 బీసీలకు కేటాయించారు. 95శాతం పైగా ఎస్టీ జనాభా ఉన్న పది పంచాయతీలను బీసీలకు కేటాయించటం విమర్శలకు తావిస్తోంది. ఒక్క బీసీ కూడా లేని నాగబోయిన వెంకయ్య బంజర (ఎన్‌వీ బంజర) గ్రామ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేయటం గమనార్హం. 15 ఏండ్ల క్రితం ఈ గ్రామంలో ఒక్క బీసీ మహిళ ఉండేది. ఆమె ఊరు నుంచి వలస వెళ్లింది. ఇక ఇదే మండలంలో ఒకటి, రెండు బీసీ ఓట్లు ఉన్న అనేక తండాలను కూడా బీసీలకు రిజర్వ్ చేశారు. మంగ్యాతండా, పుఠానితండా, సూర్యాతండా, బద్యాతండా, చెరువుకొమ్ము తండా, రాములుతండాల్లో ఈ పరిస్థితి ఉంది.
మండలకేంద్రం రఘునాథపాలెంలో 43.53శాతం బీసీలున్నా ఎస్టీకి కేటాయించటం గమనార్హం. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లె గ్రామంలో 373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒక్కరూ ఎస్టీ లేకున్నా షెడ్యూల్ ట్రైబ్‌కు కేటాయించటంపై గ్రామస్తులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాలబోరిలో మొత్తం గిరిజనులే ఉండగా ఆ స్థానం బీసీకి రిజర్వ్ అయింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మెట్‌పల్లి గ్రామంలో మొత్తం ఎస్సీలే ఉండగా బీసీకి కేటాయించారు. ఇవి కొన్ని మాత్రమే ఇలా వందలాది పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
బీసీలు లేకున్నా రిజర్వ్ చేశారు..
మా గ్రామంలో ఒక్క బీసీ లేరు. కానీ మా ఊరు సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. సీపీఐ(ఎం) అభ్యర్థిగా మా పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఎస్టీకి రిజర్వ్ అయితే మా పార్టీ గ్రామశాఖ కూడా అభ్యర్థిగా పెట్టాలని అనుకుంది. బీసీలు లేని చోట బీసీ మహిళకు రిజర్వ్ చేయటం సరైందికాదు.
భూక్యా నవీన్, ఎన్‌వీ బంజర