యూటీఎఫ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కోశాధికారి జియావుద్దీన్ ఆకస్మిక మృతి
ఉపాధ్యాయుడు మొదలు సంఘం నేత, ప్రజాప్రతినిధిగా ప్రస్థానం
టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ
కుటుంబ సభ్యులు, కుమారుడు ‘నవతెలంగాణ’ ఖమ్మం ఆర్‌ఎం జావీద్‌కు సానుభూతి
నివాళ్లర్పించిన ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చావా రవి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్
‘నవతెలంగాణ’ సీజీఎం ప్రభాకర్, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, నున్నా
మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, మాజీ ఎంపీ తమ్మినేని సంతాపం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
యూటీఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోశాధికారి, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ కో ఆప్షన్ మెంబర్, సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు సయ్యద్ జియావుద్దీన్ (76) గుండెపోటుతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా మృతిచెందారు. ఖమ్మం ముస్తఫానగర్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేం దుకు ఏర్పాట్లు చేస్తుండగా మరణించారు. జూన్ 8, 1950లో జియావుద్దీన్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో జన్మించారు. ఆయనకు భార్య ముస్తారీబేగం, కుమారుడు జావీద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు జావీద్ నవతెలంగాణ దినపత్రిక ఖమ్మం రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జియావుద్దీన్ భౌతికకాయాన్ని ఉపాధ్యాయ, వామపక్షాలు, వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు, అధికార, అనధికారులు సందర్శించారు.
పలువురి సంతాపం
ముస్తఫానగర్‌లోని స్వగృహంలో జియావుద్దీన్ భౌతికకాయం ఉండగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సందర్శించి నివాళులు అర్పించారు. ఉదయం 10 గంటల సమయంలో సందర్శనార్థం భౌతిక కాయాన్ని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యాలయానికి తీసుకుని రాగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, టీఎస్ యూటీఎఫ్ నాయకులతో కలిసి పార్టీ జెండాతో పాటు యూనియన్ జెండాను మృతదేహంపై కప్పారు. కుమారుడు జావీద్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ తదితరులు సంతాప సందేశాలను పంపారు. జడ్పీ కో ఆప్షన్ మెంబర్‌గా, ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘం నేతగా, సీపీఐ(ఎం) తిరుమలాయపాలెం మండల కార్యదర్శిగా జియా వుద్దీన్ సర్ అందించిన సేవలను కొనియాడుతూ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రంజాన్ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు.
సమస్యలపై గళమెత్తిన జియావుద్దీన్
ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘం నేతగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ విద్యార్థులకు అందుతున్న మెనూపై జియావుద్దీన్ సర్ ఆందోళనలు చేపట్టారని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని తదితరులు తెలిపారు. ఐటీడీఏ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్య అందేలా కృషి చేశారని గుర్తుచేశారు. టీచర్‌గా, ఆశ్రమ స్కూల్ హెడ్మాస్టర్‌గా, వార్డెన్‌గా చింతూరు మండలం గూడూరు మొదలు వీఆర్ పురం మండలం సోములగూడెం, భద్రాచలం మండలం కొత్తూరు నారాయణపురం వరకు ఏజెన్సీ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేశారని చెప్పారు. సీపీఐ(ఎం) తిరుమలాయపాలెం మండల కార్యదర్శిగా ఏడు పంచాయతీలు, ఓ ఎంపీటీసీ ఆ పార్టీకి దక్కేలా కృషి చేశారన్నారు. జడ్పీ కో ఆప్షన్ మెంబర్‌గా పనిచేసి సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి అందరి మన్ననలు చూరగొన్నారని తెలిపారు. ఆదర్శ కమ్యూనిస్టుగా నిబద్ధతతో వ్యవహరించారన్నారు.
సంతాప సభలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖరరెడ్డి, మల్లారెడ్డి, శాంతి, జ్ఞానమంజరి, రాజు, కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, వివిధ జిల్లాల బాధ్యులు ఎం.వెంకటేశ్వర్లు, సైదులు, వెంకటేశం, అనీల్, రంజిత్‌కుమార్, యాకూబ్, వెంకటేశం, శ్యాంబాబు, ఖమ్మం జిల్లా ఆఫీస్‌బేరర్లు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బి.రామదాసు, బి.నాగేశ్వరరావు, ఎం.నర్సయ్య, బి.ప్రశాంతి, నాగుల్‌వలీ, రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర నాయకులు మౌలానా, సైబర్ క్రైం ఏసీపీ ఫణీంద్ర, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి.సోమయ్య, బత్తుల హైమావతి, ఎం.సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, రాజారావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, అన్నవరపు సత్యనారాయణ, బ్రహ్మచారి, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, యర్రా శ్రీనివాస్, మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధత కలిగిన నాయకుడు సయ్యద్ జియావుద్దీన్ ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి అబ్బాస్
నిబద్ధత కలిగిన నాయకుడు సయ్యద్ జియావుద్దీన్ అని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ సయ్యద్ జియావుద్దీన్ 2014 నుండి 2017 వరకు ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆవాజ్ నాయకులుగా, జిల్లా పరిషత్ కో- ఆఫ్షన్ సభ్యులుగా మైనారిటీల సమస్యలపై ఉద్యమించారని తెలిపారు. ఉపాధ్యా యులుగా సామాజిక స్పృహతో విద్యార్థుల, ఉపాద్యాయుల సమస్యలపై పని చేశారని తెలిపారు. రిటైర్మెంట్ అయిన తరువాత లౌకికవాదాన్ని, మతసామర స్యాన్ని కాపాడాలని, మైనారిటీ లకు రాజ్యాంగ బద్ధమైన హక్కుల కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో లౌకికవాదం కోసం, మైనారిటీల హక్కుల కోసం కృషి చేయాలని అదే జియావుద్దిన్‌కి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, కోశాధికారి అబ్దుల్ సత్తార్, తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, కె హిమబిందు, జి.రాములు పాల్గొన్నారు.
సీజీఎం సహా ‘నవతెలంగాణ’ నివాళి
జియావుద్దీన్ భౌతికకాయంపై నవతెలంగాణ దినపత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు జావీద్‌ను ఓదార్చారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జియావుద్దీన్ సర్ ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘం నేతగా ఆయన చూపించిన పట్టుదల, కృషిని కొనియాడారు. సర్ ఆశయాలు కొనసాగించటమే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ సభలో జీఎంలు లింగారెడ్డి, వెంకటేశ్, రఘు, ఉపేందర్; మొఫిసిల్ ఇన్‌చార్జి వేణుమాధవ్, పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కృష్ణారెడ్డి, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కె.శ్రీనివాసరెడ్డి, డెస్క్ ఇన్‌చార్జి వీరేష్, సమన్వయ కమిటీ సభ్యులు నారాయణ, కృష్ణ, కె.శివారెడ్డి, ఇతర సిబ్బంది, విలేకరులు పాల్గొన్నారు.
జియావుద్దీన్ మరణం పట్ల నవతెలంగాణ ఎడిటర్ సంతాపం
ఉపాధ్యాయుడుగా ప్రజా ఉద్యమ నాయకుడుగా సేవలందించిన జీయావుద్దీన్ అమరణం బాధాకరమని నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్ అన్నారు. ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన జీయావుద్దీన్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీయావుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
జియావుద్దీన్ మృతి ఉద్యమాలకు తీరని లోటు నర్రా రమేశ్‌కు సంతాపం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సయ్యద్ జియావుద్దీన్ అకాలమతి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) నాయకులు నర్రా రమేశ్ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేశారు. జియావుద్దీన్ ఉపాధ్యాయుడిగా ఆదివాసి గిరిజన విద్యార్థులు, పేద పిల్లలకు విద్యనందించడం కోసం ఎనలేని కషి చేశారని గుర్తుచేశారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం జరిగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా మైనార్టీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గలం ఎత్తారని వివరించారు. ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక లౌకిక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా విద్యార్థి యువజన ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించిన నర్రా రమేఖీన్ అకాల మరణం ఖమ్మం జిల్లా ఉద్యమానికి నష్టమని చెప్పారు. వీరి మతికి సంతాపంతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని జాన్‌వెస్లీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
జియావుద్దీన్ గొప్ప ఉద్యమనాయకుడు ఆయన మృతి బాధాకరం : బి.వెంకట్
జియావుద్దీన్ గొప్ప ఉద్యమకారుడనీ, తనకు స్ఫూర్తినిచ్చిన నాయకుల్లో ఒకరని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం జిల్లాలో జియావుద్దీన్, రవిలతో తనకున్న ఉద్యమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో రిటైరైనా చివరకంటూ నమ్మిన సిద్ధాంతం ఆయన పనిచేశారని కొనియాడారు.