Tuesday, July 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజోధకు జోహార్లు

జోధకు జోహార్లు

- Advertisement -

”అతడనేక యుద్ధములనారితేరిన వృద్ధ మూర్తి” అని మహాభారతంలో భీష్ముడిని అభివర్ణిస్తాడు ధర్మరాజు. భారత శ్రామిక జనతా పోరాటాల ఆధునిక మహేతిహాసంలో కామ్రేడ్‌ విఎస్‌ అచ్యుతానందన్‌కు ఆ వర్ణన సరిగ్గా సరిపోతుంది. దేశ స్వాతంత్య్రం కోసం, స్వతంత్ర భారతం సమతా భారతంగా పురోగామించాలన్న ఆశయసిద్ధి కోసం అనేక దశల్లో జరిగిన విప్లవోద్యమాలలో స్ఫూర్తివంతమైన జీవితం ఆయనది. శతాధిక సుదీర్ఘ ప్రజా జీవితానుభవంతో నిండిన ఆదర్శ కమ్యూనిస్టు యోధ, అవిశ్రాంత విప్లవమూర్తి కామ్రేడ్‌ విఎస్‌ అచ్యుతానందన్‌. అలిసిసొలిసి ఇప్పుడిక దీర్ఘ విరామంలోకి వెళ్లిపోయారు. ఆ ఉద్వేగభరిత స్మృతికి మరణం లేదు.. విస్మృతీ లేదు.
విద్యార్థి దశ నుంచే విప్లవ కిశోరంగా పరిశ్రమించిన కామ్రేడ్‌ విఎస్‌ జీవితం ఒక విశిష్ట కావ్యం. పేదరికంతో ప్రాథమిక విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆయన సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యంపై ఉద్యమించిన ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ దార్శనికుడు.
భారతదేశంలో మార్క్సిస్టు సిద్ధాంతాల పరివ్యాప్తికీ, శ్రామిక జన శ్రేణుల సమరశీల సంఘటనగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాణానికీ అహరహం శ్రమించిన తొలి తరపు విప్లవ యోధుల్లో కామ్రేడ్‌ విఎస్‌ది ఒక ప్రత్యేకస్థానం. దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కార్మిక ఉద్యమంలోకి అడుగు పెట్టిన అచ్యుతానందన్‌ అదే కార్మిక వర్గానికి అంకితమయ్యారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెల్‌ కోర్‌ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లడంతో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం… అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. ప్రజల హృదయాలలో చిరస్మరణీయ నేతగా నిలిపింది.
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, వామపక్ష నేతల సాహచర్యంతో గొప్ప పోరాట యోధుడయ్యాడు. సమాజంలోని అసమానతలకూ.. దోపిడీకీ మూలమేమిటో, దానికి ఊపిరి ఎక్కణ్నుంచి వస్తున్నదో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. దోపిడీ పోవాలంటే పోరాటమే మార్గమని నమ్మాడు. కనుకనే కుట్టినాడ్‌లో భూస్వాములతో భయంకరమైన దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికుల మధ్య పనిచేయాలన్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించడమే కాదు… వారిని సమీకరించి మెరుగైన వేతన పోరాటానికి నాయకత్వం వహించాడు కూడా. పున్నప్ర – వాయలార్‌ సాయుధ తిరుగుబాటు సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన అచ్యుతానందన్‌ను… అరెస్టు తర్వాత అత్యంత దారుణంగా హింసించారు… ఆయన చనిపోయాడని అడవిలో పడేశారు. కానీ ఆయన కమ్యూనిస్టు చైతన్యం, పోరాట సంకల్పం ఆయనకు కొత్త ఊపిరిలూదాయి. పోరాటాల దారుల్లో ఆయన సాహసానికీ, సమయస్ఫూర్తికీ ఇదొక మచ్చుతునకే.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కేరళ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా… 1956 శాసనసభ ఎన్నికల్లో అలప్పుజ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించడంలో ఆయనది కీలకపాత్ర. 1958లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన 32 మందిలో అచ్యుతానందన్‌ ఒకరు. మరణించిన ఆ వీరుల్లో చివరి వారు. రెండు పుష్కరాల పాటు ఆయన సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. 1967లో అంబలపుళ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన మూడున్నర దశాబ్దాల పాటు శాసనసభ్యునిగా సేవలందించారు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రతిపక్ష నేతగా, కేరళను పురోగమన బాటలో నడపడంలో ఆయన పాత్ర అద్వితీయం. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నడూ వెనకంజ వేయని అచ్యుతానందన్‌… ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపారు. తన సుదీర్ఘ ఉద్యమ జీవితంలో అవరోధాలెన్ని ఎదురైనా తన నిజాయితీని, నిబద్ధతను, పోరాట దీక్షను ఏనాడూ వీడలేదు.
తన జీవితంలో ప్రతి క్షణాన్నీ ప్రజా విముక్తికే వెచ్చించిన కార్యదక్షుడేకాదు… అధ్యయనంతో అవగాహన పెంచుకోవడా నికి నిత్యం తపించిన జిజ్ఞాసువు. ఆశయం ఆచరణ కలగలి సిన అరుదైన విప్లవకారుడు. ఆయన ఎంత నిరాడంబర వ్యక్తితో అంతే నిష్కపటి. నమ్మిన దానిని నిర్మొహమాటంగా నిక్కచ్చిగా వ్యక్తం చేసే నిష్కల్మష హృదయుడు. ”జీవితాం తంలో వెనుదిరిగి చూసుకుంటే ‘నా జీవితం వృథా కాదు’ అని ఎవరు భావిస్తారో వారిదే ఉత్తమమైన జీవిత”మని అంటాడు లెనిన్‌. ఆ కోవకు చెందిన వ్యక్తి కామ్రేడ్‌ వి.ఎస్‌. ఆయన మరణం విషాదకరమే అయినా… ఆయన జీవితం ఉత్తేజకరం. ఆ జోధకు జోహార్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -