ప్రజాతీర్పు అపహాస్యం
ఇష్టారాజ్యంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహారం
సీపీఐ కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ నాయకులు ఏడు మున్సిపల్ స్థానాల్లో గెలుపొంది అప్రజాస్వామికంగా 22 స్థానాలను దక్కించుకున్నారని విమర్శించారు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. సీఎం, స్థానిక మంత్రి సూచనలకు అనుగుణంగా అధికారగణం తొత్తులుగా మారి ప్రజా తీర్పును అపహాస్యం చేశారని ఆరోపించారు. మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే రీతిన వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించినా కనీసం మంత్రి స్పందించలేదన్నారు. దేశ చరిత్రలో ఇంత ఘోరమైన రాజకీయం ఎన్నడూ లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టినా కేసు పెట్టలేదని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టినా కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ప్రలోభాలకు గురి చేసినా లొంగలేదు
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు కాంగ్రెస్ నాయకులు రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చినా తమ కౌన్సిలర్లు లొంగలేదని కేటీఆర్ అన్నారు. సీపీఐ కౌన్సిలర్లు నిబద్ధతతో పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారని తెలిపారు. బాల్క సుమన్‌ను జైలుపాలు చేశామని అనుకోవడం సరికాదని, ఆయనకు జైలు కొత్త కాదని అన్నారు. ఆరు నెలలు వివిధ సందర్భాల్లో జైలులో ఉన్నారని గుర్తు చేశారు. జైలులో పెడితే భయపడతారనుకుంటే పొరపాటేనని, రేవంత్‌రెడ్డి మళ్లీ చిప్పకూడు తినే సమయం వస్తుందని అన్నారు. పోలీసులను బూతులు తిడితే కేసులు పెట్టని డీజీపీ.. బీఆర్‌ఎస్ నాయకులపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో తిరిగి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుందని, ఇప్పుడు చేస్తున్న అరాచకాలను మర్చిపోమని అన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కుతున్న వారిని వదలమని, క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో వెంటనే చైర్మెన్, వైస్‌చైర్మెన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికే వారిని వదలమని, క్యాతన్‌పల్లిలో మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై సైతం కేసు పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పే రోజు వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ అధికార దుర్వినియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



