Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅధికారం కోసం దిగజారిన కాంగ్రెస్‌, బీజేపీ

అధికారం కోసం దిగజారిన కాంగ్రెస్‌, బీజేపీ

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌, బీజేపీలు దిగజారిన రాజకీయాలకు పాల్పడ్డాయని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా కాంగ్రెస్‌ తెస్తానన్న మార్పు అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 12 ఏండ్లుగా బీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌, కాంగ్రెస్‌కి బీ టీమ్‌ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలనీ, ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్‌ అని నిరూపించాయని పేర్కొన్నారు. బీజేపీతో కలిసి సింగిల్‌ టీమ్‌గా కాంగ్రెస్‌ మారిపోయిందని తెలిపారు. ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్‌ బంధం మున్సిపల్‌ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. కేవలం బీఆర్‌ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయనీ, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువు చేశాయనివిమర్శించారు.

ఢిల్లీలో కొట్టుకున్నట్టు చేసి గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకుని పదవులు పంచుకుంటున్నాయని తెలిపారు. దీనికి అలియాబాద్‌, ఆమన్‌గల్‌, మెదక్‌, నర్సాపూర్‌ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యమని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నడిపేది కాంగ్రెస్‌ సర్కారా? బీజేపీ సర్కారా?, లేదంటే బీజేపీ-టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కారా?అని ప్రశ్నించారు. ఆలియాబాద్‌ నుంచి అమన్‌గల్‌ దాకా, మెట్‌పల్లి నుంచి మెదక్‌ దాకా సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒంటరిగా బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదని తెలిపారు. అందుకే బీజేపీతో కుమ్మక్కైందని విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయని వివరించారు. రాహుల్‌ గాంధీ దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే.. ఇక్కడ రేవంత్‌రెడ్డి బీజేపీతో జత కడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -