Sunday, March 22, 2026
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ బీజేపీ బీ టీమ్‌

కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ బీజేపీ బీ టీమ్‌

- Advertisement -

ఆ పార్టీవి బుజ్జగింపు రాజకీయాలు
మతరాజకీయాలు చేసే గ్రూపుల మద్దతు కోరుతోంది : కేరళ సీఎం పినరయి విజయన్‌ విమర్శలు

తిరువనంతపురం : కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ.. బీజేపీ బీ టీమ్‌ అని అన్నారు. ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమవుతు న్నాయి.ఇటీవల రాహుల్‌గాంధీ కేరళలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశంలోని అనేక మంది ప్రతిపక్ష నేతలు, నాయకులపై కేసులు నమోదుచేస్తూ, అరె స్టులు చేస్తున్నాయనీ, కానీ, కేరళ సీఎం పినరయి విజయన్‌ను మాత్రం ప్రశ్నించడంలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. విజయన్‌ ఈ విధంగా స్పందించారు.

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ, మెజారిటీ అంటూ దేశంలో మత రాజకీయాలు చేసే గ్రూపుల నుంచి మద్దతు కోరుతోందని అన్నారు. ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం మతతత్వానికి వ్యతిరేకమని స్పష్టం చేశా రు. మతతత్వశక్తుల నుంచి తమ ప్రభుత్వం ఎలాంటి మద్దతూ కోరదని వివరించారు. రాహుల్‌ గాంధీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత సంఘటనల నుంచి ఆయన పాఠాలు నేర్వలేదని చెప్పారు. ఎక్సైజ్‌ పాలసీ విషయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారనీ, అయితే వాటిని తోసిపుచ్చిన న్యాయస్థానం ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని విజయన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది కాంగ్రెస్‌ అధినాయకత్వానికి, రాహుల్‌కు పెద్ద దెబ్బగా ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేతులు కలుపుతోందని ఆరోపించారు. బీజేపీతో భాగస్వామ్యం విషయంలో కాంగ్రెస్‌, యూడీఎఫ్‌లు నిస్సంకోచంగా ఒక వర్గంగా మారిపోయాయని అన్నారు. శబరిమల నష్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను విజయన్‌ కొట్టిపారేశారు. ఈ దర్యాప్తు ను కేరళ హైకోర్టు స్వయంగా పర్య వేక్షిస్తోందని, ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిని వదిలి పెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితంచేసే ఉద్దేశంతోనే యూడీఎఫ్‌ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆయన ఆరోపించారు. వివిధ అంశాల విషయంలో కేంద్రం కేరళ పట్ల శత్రుపూరిత వైఖరిని అవలం భిస్తోందన్నారు. కేరళలో సీపీఐ(ఎం) పార్టీకి చెందిన సీఎం పినరయి విజయన్‌ ఇతర పార్టీలతో కలిసి ఎల్డీఎఫ్‌ కూటమిగా పోటీ చేస్తున్నారు. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్‌ 9న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

వంటగ్యాస్‌ సంక్షోభానికి సైతం..
దేశంలో వంటగ్యాస్‌ సంక్షోభానికి కేంద్రంలో వరుసగా అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ ఆరోపించారు. జాతీయ ఆర్థిక వ్యవస్థను సైతం కుదిపేస్తున్న గ్యాస్‌ సంక్షోభంతో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన ఎత్తిచూపారు. 2006లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడున్న బీజేపీ సైతం భారత్‌- ఇరాన్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను తిరస్కరించాయని వివరించారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి ఈ రెండు పార్టీలూ లొంగిపోయాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తీవ్రంగా విమర్శించారు. భారత్‌ – ఇరాన్‌ పైప్‌లైన్‌ను తిరస్కరించడం దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. దీనిని చారిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు.

దేశ ఇంధనభద్రతకు హామీఇచ్చే ఈ పైప్‌లైన్‌కు గట్టిగా మద్దతు ఇచ్చినందుకు కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పటి పెట్రోలియం మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ను పదవి నుంచి తొలగించి ఆ తర్వాత రాజకీయంగానూ పక్కన పెట్టిందని గుర్తు చేశారు. ఈ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిలిపివేయాలన్న దూర దృష్టిలేని నిర్ణయంలో కార్పొరేట్‌ ప్రయోజనాలు కూడా కీలకపాత్ర పోషించాయని ఆరోపించారు. ప్రయి వేటు రంగానికి లాభం చేకూ ర్చేందుకే కాంగ్రెస్‌పార్టీ అయ్యర్‌ స్థానంలో మురళీ దేవరను నియమించిందని పేర్కొన్నారు. ఈయన తీసుకున్న ఇంధన విధానం కార్పొరేట్లకే లాభం చేకూరిందని వివరించారు. ప్రజానుకూల ఇంధన భద్రతా విధానాన్ని ప్రకటించడానికి బదులుగా, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్పొరేట్‌- కేంద్రీకృత పెట్రోలియం విధానాన్ని అవలంభించిందని విమర్శించారు. ఈ విధా నంతో భారతదేశ దీర్ఘకాలిక ఇంధన విశ్వసనీయతకు నష్టం కలిగించి ప్రయివేటు రంగానికి ప్రయోజనం చేకూర్చిందని విజయన్‌ ప్రకటనలో ఆరోపించారు.

వంట గ్యాస్‌ సంక్షోభంతో భారీ ఎత్తున ఉద్యో గాల తొలగింపు, హోటల్‌ పరిశ్రమలో జీవనోపాధి నష్టం వంటి ఆర్థిక పరిణామాలను బీజేపీ చూసీ చూడట్టు వదిలేస్తోందని విజయన్‌ తీవ్రంగా విమ ర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రభుత్వరంగ చమురు కంపెనీలను పక్కనపెట్టి, రెండు ప్రయివేట్‌ చమురు శుద్ధి కర్మాగారాలకు గుత్తాధిపత్యం ఏర్ప రచుకునేందుకు అవకాశం కల్పించాయని పేర్కొ న్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ఆదేశాలకు తలొగ్గి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని వివరించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు.

దేశ ఇంధన భద్రతకు పొంచి ఉన్న ముప్పులను ముందుగా ఊహించడంలో కేంద్రం విఫలమైందని వివరించారు. సంక్షోభాన్ని అధిగ మించడానికిగానీ, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి పెంచడం లోగానీ, తగినంత ముడిచమురు నిల్వలు నిర్ధారించడంలో కేంద్రం దూరదృష్టిగా ఆలోచించడంలో విఫలమైందని విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు సంక్షోభం ద్రవ్యోల్బణాన్ని తీవ్రతరం చేసిందని పేర్కొన్నారు. ఇది జీవన వ్యయ సంక్షోభాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందనీ, అయితే దేశంలో ఇలాంటి దారుణ పరిస్థితి ఎలా ఏర్పడిందనే దానికి మాత్రం బీజేపీ వద్ద సమాధానం లేదని విజయన్‌ తన ప్రకటనలో వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -