ఆ పార్టీ అవకాశవాద విధానాలే కాషాయ పార్టీ ఎదుగుదలకు మార్గం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
కేరళం ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం
హిందూస్తాన్ టైమ్స్‌కు ప్రత్యేక ఇంటర్య్యూ
న్యూఢిల్లీ : బీజేపీ జేబు సంస్థగా కాంగ్రెస్ మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఆర్థిక విధానాలే బీజేపీ పార్టీ ఎదుగుదలకు దారి తీశాయని విమర్శించారు. జరిగే కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎంఎ బేబీ ఈ విషయాల్ని తెలిపారు. సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా వామపక్షాలు కొనసాగిస్తున్న పోరాటం గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం:
ప్రశ్న : 1977 తరువాత తొలిసారిగా.. సీపీఐ(ఎం)కి రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా ఉండే పరిస్థితి ఉందా?
జవాబు : నిజానికి.. 1977 తరువాత తొలిసారిగా కేరళంలో వరసగా మూడోసారి కూడా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఉంది. పినరయి విజయన్ ప్రభుత్వం కేరళంవ్యాప్తంగా సంపూర్ణ పేదరికాన్ని నిర్మూలించింది. దేశంలో అలా చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే. మా సంక్షేమ చర్యలు, మానవాభివృద్ధిలో మా టాప్ ర్యాంక్‌లను నిటి ఆయోగ్ కూడా గుర్తించింది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వంతెనలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐటీ హబ్‌లు, అంతర్గత జలమార్గాలు.. వంటి రంగాల్లో లక్షల కోట్ల రూపాయిల విలువైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. అమర్త్యసేన్, రోమిలా థాపర్ వంటి మేధావులు ఎల్‌డీఎఫ్ హయాంలో ఎలాంటి మత ఘర్షణలు, రక్తపాతం జరగలేదని పేర్కొన్నారు. ఎల్‌డీఎఫ్ ఓటమి అనే మీ అంచనాను తీవ్రంగా తీసుకోకూడదు.
ప్రశ్న : రాహుల్‌గాంధీ మిమ్మల్ని బీజేపీ బీ టీమ్ అనే వ్యాఖ్యలు గురించి..?
జవాబు : సీపీఐ(ఎం)ను బీజేపీకి బి టీమ్ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు తగని ప్రవర్తన. ఎన్నికల జరగనున్న అస్సాంతో సహా అనేక రాష్ట్రాల్లోని బీజేపీలో కాంగ్రెస్ మాజీ టాప్ నాయకులు కీలక పదవుల్లో ఉన్నారు. దీన్ని ప్రస్తావిస్తూ నా స్నేహితుడు ఒకరు కాంగ్రెస్‌ను బీజేపీికి ఒక పోషణ సంస్థగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఆర్థిక విధానాలే బీజేపీి ఎదుగుదలకు మార్గం సుగమం చేశాయి. ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాల విషయంలో ఎవరు ‘ఎ టీమ్’, ఎవరు ‘బీ టీమ్’ అనేదే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఏకైక వివాదం. పరిస్థితి ఇలా ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నయా-ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కాంగ్రెస్ తన వంతు సహకారం అందించాలి. అందించగలదు కూడా…
ప్రశ్న : కేరళంలో ఎల్‌డీఎఫ్ పాలనలో బీజేపీ బలంగా పాగా వేసిందా?
జవాబు : ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం బీజేపీతో ఎన్నడూ రాజీపడలేదు. మేము సంఫ్‌ు పరివార్, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక, సాంస్కృతిక, సంస్థాగత స్థాయిలో సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే అక్కడక్కడా బీజేపీ కొన్ని ప్రయోజనాలు పొందుతోందన్నది కూడా నిజమే. దీనికి కాంగ్రెస్ అనుసరిస్తున్న మెతక హిందుత్వ వైఖరి కూడా ఒక కారణం. గుర్తుంచుకోండి.. ఆర్‌ఎస్‌ఎస్ ఫిజికల్ శిక్షణా శిబిరాలను నిర్వహించుకోవడానికి తానే రక్షణ కల్పించానని కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కె. సుధాకరన్ బహిరంగంగా ప్రకటించారు.
ప్రశ్న : చైనా, రష్యాల నుంచి వామపక్ష పార్టీ భావజాలం అరువు తెచ్చుకున్నదనే అమిత్ షా వ్యాఖ్యలు ?
జవాబు : నాగరికత, మానవ సమాజ పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేయనేవారే వామపక్ష భావజాలం భారత్‌కు సరిపడదని అంటారు. కానీ, మార్క్స్ స్థాపించిన ‘సమత్వ సమాజం’కు ముందే కేరళ ఓనం పండుగ లేదా అయ్య వైకుంఠ స్వామి వంటి పండుగలు జరిగాయి. ఇవి సమానత్వ, సామరస్య సమాజాల చరిత్ర చూపిస్తుంది. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ‘ది లీగ్ ఆఫ్ ది జస్ట్’లో చేరడానికి కొన్ని సంవత్సరాలే ముందే ఇది జరిగింది. ఆ తర్వాత అది కమ్యూనిస్ట్ లీగ్‌లో విలీనమైంది. అయితే, ముస్సోలినీతో సహా యూరోపియన్ ఫాసిస్టులతో బీఎస్ మూంజే జరిపిన సమావేశాల నుంచి ప్రేరణ పొందిన సైనికవాద నిర్మాణంతో ఆర్‌ఎస్‌ఎస్ రూపుదిద్దుకుంది. కాబట్టి, ఆర్‌ఎస్‌ఎస్ యొక్క నయా-ఫాసిజం యూరోపియన్ ఫాసిస్టులచే ప్రభావితమై, రూపుదిద్దుకుంది.
ప్రశ్న : కొన్ని దశాబ్దాలుగా నక్సల్స్ క్రూరత్వం పెరగడానికి వామపక్షాలు, కాంగ్రెస్‌లే కారణమని అమిత్ షా ఆరోపించారు?
జవాబు : భారత సమాజంలో అపరిమితమైన పేదరికం, అసమానతలు, గ్రామీణ పేదలు, ఆదివాసులపై జరుగుతున్న దోపిడీ, అణచివేతలే నక్సలిజం పెరుగుదలకు కారణం. కాంగ్రెస్, బీజేపీ వంటి అధికార పార్టీలు అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలే వివిధ రకాల నక్సలైట్ల ఆవిర్భావానికి నేపథ్యాన్ని కల్పిస్తున్నాయి. మార్క్సిజం-లెనినిజంను అనుసరించే ప్రతి కమ్యూనిస్టు తిరస్కరించే ‘వామపక్ష కమ్యూనిజం’తో సీపీఐ(ఎం) ఎన్నడూ రాజీపడలేదు.
ప్రశ్న : పశ్చిమ బెంగాల్‌లో మీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
జవాబు : పశ్చిమ బెంగాల్‌లో మా సహచరులు సామాన్య ప్రజల మధ్య పనిచేస్తున్నారు. శ్రామికులు, విద్యార్థుల నుంచి మాకు చాలా మంచి స్పందన లభిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మేం కోల్పోయిన ప్రభావాన్ని తప్పకుండా తిరిగి పొందుతాము. పశ్చిమ బెంగాల్‌లో మా ఉజ్వల భవిష్యత్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.



