Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి కాంగ్రెస్‌ ద్రోహం

రాష్ట్రానికి కాంగ్రెస్‌ ద్రోహం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీని ఎన్నోసార్లు ఉరి తీయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నదీజలాలపై హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. నదీ జలాలపై అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ దౌర్భాగ్యమని అన్నారు. అధికార మదంతో విర్రవీగుతూ, అహంకారంతో, పరుషమైన మాటలతో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి అవమానమని చెప్పారు. కేసీఆర్‌పై వికృత వ్యాఖ్యలతో ఆయన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలు, కొనసాగుతున్న అన్యాయాల పరంపర, వాటి వల్ల తెలంగాణ ఎదుర్కొన్న నష్టాలను ప్రజల ముందుంచే ప్రయత్నమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అని వివరించారు. అశోక్‌ నగర్‌ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్‌ గాంధీపై, రైతు రుణమాఫీ హామీతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ హామీ తప్పించినందుకు రేవంత్‌రెడ్డిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు తేడా తెలియని అజ్ఞానం ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. కృష్ణా బేసిన్‌, గోదావరి బేసిన్‌ అంటే ఏంటో కూడా తెలియదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదన్నారు. పేదల ఇండ్లను కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పారు. చెక్‌డ్యామ్‌లను పేల్చుతున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగవేస్తున్నదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -