జాజుల శ్రీనివాస్ గౌడ్, మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కషి చేయాలని బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 30న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. నామినేషన్లు ప్రారంభమైన పార్టీపరంగా ఇస్తామని చెప్పిన రిజర్వేషన్లపై ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలను నిలిపేసి సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో స్తంభింపజేస్తే బీసీ సమాజం హర్షిస్తుందనీ, లేకపోతే బీసీల యుద్ధం కాంగ్రెస్ పైనే అని హెచ్చరించారు. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదించకుంటే బీజేపీ బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ 5 వేల సర్పంచ్ స్థానాలు రావాల్సిన బీసీలకు 2 వేల స్థానాలు కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరంగా 42 శాతం ఇస్తామని చెప్పడం దశాబ్దపు జోక్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో అమలు చేసిన 23 శాతం పెంచకుండా 17 శాతానికి తగ్గించారని దుయ్యబట్టారు. అఖిలపక్షం వేయడంలో, ప్రధానమంత్రిని కలవడంలో ఉన్న ఇబ్బందేంటి? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. బీజేపీ మోసం చేస్తే బీసీ సమాజం ఊరుకోదని తెలిపారు. బీసీ జేఏసీ చేస్తున్న రిజర్వేషన్ల పోరాటానికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈనెల 30న జరిగే చలో హైదరాబాదులో ఎమ్మార్పీస్ శ్రేణులు పాల్గొంటాయని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ గుజ్జ కృష్ణ, వైస్ చైర్మెన్ దీటి మల్లయ్య, కో చైర్మెన్ కాటేపల్లి వీరస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



