– కామారెడ్డి గంజిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి
ఏఐసిసి, పిసిసి పిలుపుతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ ఆదేశాల మేరకు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గంజిలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ పేరుతో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చి, గాంధీజీ పేరును తొలగించేందుకు బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ కమిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలోని పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు జీవనాధారం కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన చారిత్రక సంక్షేమ పథకమని గుర్తుచేశారు. గాంధీజీ పేరు తీసేయడం ద్వారా ఆయన ఆశయాలను, త్యాగాలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి నిధులు తగ్గించడం, పనిదినాలు తగ్గించడం, ఇప్పుడు పేరును మార్చే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇది పేదలపై దాడి చేయడమే కాకుండా, దేశ చరిత్రను మార్చే ప్రమాదకర చర్యగా వారు అభివర్ణించారు. గాంధీజీ ఆశయాలే దేశానికి మార్గదర్శకమని, ఆయన పేరుతో ఉన్న పథకాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, పార్టీ కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



