Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'కొత్తగూడెం'లో కాంగ్రెస్‌-సీపీఐలకు సమానంగా సీట్లు

‘కొత్తగూడెం’లో కాంగ్రెస్‌-సీపీఐలకు సమానంగా సీట్లు

- Advertisement -

కీలకంగా బీఆర్‌ఎస్‌, స్వతంత్రులు
ఖమ్మం కాంగ్రెస్‌ కైవసం
ఇలాకాలో సత్తాచాటిన మంత్రులు పొంగులేటి, భట్టి
ఏదులాపురం మున్సిపాలిటీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉభయ కమ్యూనిస్టులు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్‌ కొత్తగూడెం నగరపాలక సంస్థలో మాత్రం సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోంది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ‘హస్తం’ హవా సాగింది. కొత్తగూడెం నగరపాలక సంస్థలో సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కొత్తగూడెం నగర ఓటర్లు రెండు పార్టీల పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా సరి సంఖ్యలో చేరో 22 చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ (ఎం) ఒక డివిజన్‌ను కైవసం చేసుకుంది. సింగిల్‌గా ఏ ఒక్క పార్టీ మేజిక్‌ ఫిగర్‌ 31ని చేరుకోలేకపోవడంతో సంకీర్ణ పాలకవర్గం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎనిమిది స్థానాల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌, ఆరు డివిజన్లలో నెగ్గిన స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఏకమైతే 30 సీట్లకు చేరుకుంటాయి. మేజిక్‌ ఫిగర్‌ 31కి ఒక సీటు తక్కువవుతుంది. ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటుతో మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోవచ్చు. లేదంటే బీఆర్‌ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఆరుగురిలో కనీసం ముగ్గుర్నైనా తమ వైపుకు తిప్పుకుంటే సీపీఐ నూతన నగరపాలక సంస్థ తొలి మేయర్‌ పీఠాన్ని అధిష్టించవచ్చు. కాంగ్రెస్‌ కొత్తగూడెం నగరపాలక సంస్థ పీఠాన్ని దక్కించుకోవాలంటే సీపీఐ(ఎం)తో కలిపి ఇప్పుడు తనకున్న బలం 23 సీట్లు కాగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఆరుగురిని తన వైపు తిప్పుకోవడంతోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 8 మందిలో కనీసం ఇద్దరినీ తమ వైపు మలుపుకోవాలి.

కొత్తగూడెం నగరపాలక సంస్థ మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీతో ‘చే’ జిక్కించుకుంది. ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు మధిర, ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, వైరాలోని మొత్తం 117 వార్డులకు ఎన్నికలు జరగగా 83 వార్డులు ‘హస్త’గతమయ్యాయి. బీఆర్‌ఎస్‌ 21, స్వతంత్రులు 6, సీపీఐ 4, సీపీఐ(ఎం) 3 వార్డుల చొప్పున దక్కించుకున్నారు. మంత్రులు మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గం కేంద్రం మధిర మునిసిపాలిటీ, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గం పాలేరులోని ఏదులాపురం నూతన మున్సిపాలిటీని స్పష్టమైన మెజారిటీతో ‘చే’జిక్కించుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఉమ్మడి కమ్యూనిస్టులు 5 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -