Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

- Advertisement -

– భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి
– గత ప్రభుత్వం అడక్కుండానే అన్నీ సమకూర్చింది : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఒక్క హామీని నెరవేర్చలేదని, భద్రాచలం పరిసరాల్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలకు, వికలాంగులకు, యువతకు, విద్యార్ధులకు, వృద్ధులకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువే ఇస్తామని అబద్దపు, మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, వికలాంగులకు రూ.8 వేల పెన్షన్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు.

సెక్రటేరియట్‌ వాస్తు బాగలేదని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులతో, అధికారులతో సమావేశాలు పెడుతున్న సీఎం గారూ.. మహిళలకు ఇచ్చిన హమీలపై పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనే చర్చ పెడదామా.. అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, లేకుంటే ప్రజలే ఈ ప్రభుత్వ భరతం పడతారని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణ సహించేది లేదన్నారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం, హక్కులు గాలికి వదిలేశారని ఆరోపించారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఐటీసీ కర్మాగారం వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని, ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు.

భద్రాచలం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని ఖండించారు. రాముల వారి 1000 ఎకరాల భూములు ఆంధ్రాలో కలిశాయని, వాటిని పరిరక్షించాలన్నారు. భద్రాచలంలోని ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, అస్థిత్వం కోసం కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే జాగృతిని బలోపేతం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షులు మాధవి, జిల్లా అధ్యక్షులు పవన్‌, గోపు సదానందం, ఎండీ హుస్సేన్‌, నవతన్‌, టీబీజీకేఎస్‌ నాయకులు కాపు కృష్ణ, సింధు తపస్విని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -