Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమూసీ వంతెనల పనులను పట్టించుకోని కాంగ్రెస్‌ సర్కార్‌

మూసీ వంతెనల పనులను పట్టించుకోని కాంగ్రెస్‌ సర్కార్‌

- Advertisement -

– ‘దిందా’ రైతుల అరెస్టులకు ఖండన
– ప్రభుత్వ అసమర్థ పాలనతోనే
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ వాసులు చిరకాలంగా ఎదురుచూస్తున్న మూసీ నదిపై వంతెనల నిర్మాణ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌ వేదికగా ఆయన ట్వీట్‌ చేశారు. నదిపై బ్రిడ్జిల నిర్మాణంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వాసుల కలను నిజం చేయడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 జనవరిలో రూ.545 కోట్లను 15 వంతెనల నిర్మాణానికి మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ వంతెనల రాకతో హైదరాబాద్‌ వాసుల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. వంతెనల పొడవు దాదాపు 150 నుంచి 200 మీటర్ల వరకు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనానికి నిదర్శనంగా మారాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వమనీ, వారిది పనికిమాలిన పాలన అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టులపై ఖండన
బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు వారిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించడం రేవంత్‌ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని విమర్శించారు. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న వారిని తక్షణం విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్‌ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రెండు నెలలుగా తెలంగాణలో మైనస్‌ ద్రవ్యోల్బణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి నిదర్శనమని తెలిపారు. దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందనీ, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో ఉందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా రెండు నెలల పాటు తెలంగాణ ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్‌) మైనస్‌లోకి పోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేండ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, కేవలం 18 నెలల కాంగ్రెస్‌ పాలనలో ఆర్థికంగా చితికిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ నేతత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.తెలంగాణ చరిత్రలో తొలిసారిగా జూన్‌, జులై నెలల్లో ద్రవ్యోల్బణం మైనస్‌లో నమోదైందని కేటీఆర్‌ తెలిపారు. జులైలో రాష్ట్ర ద్రవ్యోల్బణం (మైనస్‌)-0.44 శాతంగా ఉండగా, జాతీయ సగటు (ప్లస్‌) ం2.10 శాతంగా ఉందన్నారు. జూన్‌లో రాష్ట్రంలో (మైనస్‌) -0.93గా ఉంటే, దేశవ్యాప్తంగా (ప్లస్‌) ం1.55 శాతంగా ఉందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం తగ్గుదల) మరింత తీవ్రంగా ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం తగ్గడం సానుకూల సంకేతం కాదనీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారనీ, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నీ స్తంభించిపోయాయని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడం, ఆర్థిక కార్యకలాపాలు మందగించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆర్థిక నిపుణుల సూచనలను ప్రభుత్వం పట్టించుకోవాలని కేటీఆర్‌ కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad