– టీజీఎంసీ సభ్యుడితో మాట్లాడిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
– ఆర్ఎంపీలకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – తిమ్మాపూర్
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలను ఇబ్బందులకు గురి చేయవద్దని టీఎస్ ఎంసీ సభ్యులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మంగళవారం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లాలోని ఆర్ఎంపీలు ఎమ్మెల్యేతో సమావేశమై వారి ఇబ్బందులపై చర్చించారు. అనంతరం టిఎస్ఎంసి సభ్యుడు రాజకుమార్ తో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఆర్ఎంపీల వద్ద టిఎస్ఎంసి మెంబర్లు తనిఖీలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు.
షుగర్, బిపి పేషెంట్లకు సేవలందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారని, అలాంటి వారి వద్ద స్టెతస్కోపు, బిపి మిషను ఉంటే తప్పేమిటి అని? టి ఎస్ ఎం సి సభ్యుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరడము, ఆసుపత్రికి పేషెంట్లను పంపించాలని చెబుతూ టీఎస్ఎంసి సభ్యులు బ్లాక్మెయిలింగ్ చేయడం మానుకోవాలని సూచన చేశారు. ఆర్ఎంపి, పి.ఎం.పి లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా సేవలు అందించాలని ఆర్ఎంపీలకు సూచించారు.
ఆర్ఎంపీ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తప్పకుండా పరిష్కార మార్గం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్సను అందిస్తున్న గ్రామీణ ప్రాంత వైద్యులు
పేద ప్రజలకు దేవుళ్ళని, మీరు అందిస్తున్న సేవలకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంపి పిఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు కాసం రవీందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మనోహర్, సంఘం నరసింహారాజు, మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి చెన్నబోయిన రవి యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు స్వామి, మండల ఉపాధ్యక్షులు బండారుపల్లి లక్ష్మణ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.