ఇరు పార్టీల మధ్య రహస్య సర్దుబాటు ?
తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇందుకు యూడీఎఫ్ మార్గం సుగమం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రహస్య అవగాహనలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది.
బీజేపీ గెలుపొందిన 41 డివిజన్‌లలో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ఐదు డివిజన్లలో 60ఓట్ల కన్నా తక్కువ తేడాతో ఎల్‌డీఎఫ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఐదు కంజిరంపారా (39ఓట్లు), పొన్నుమంగళం (14), అట్టుకల్ (11), చాలా (12), కుజివిల(55) డివిజన్లు. బీజేపీ గెలిచిన 25 డివిజన్లలో కాంగ్రెస్‌కు కేవలం వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా తిరువనంతపురం జిల్లాలోని నాలుగు డివిజన్లు అత్రిపా(370), కరుమమ్ (525), ఫోర్ట్ (225), నెడుంగడ్ (395)లో 400 కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.
ప్రతి డివిజన్‌లో సగటున 4వేల నుంచి 6వేల ఓట్లు పోలవగా, అనేక వార్డుల్లో కాంగ్రెస్ వెయ్యి ఓట్లను కూడా దాటలేకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ గనక బీజేపీకి ఇతోధికంగా సాయపడకుండా వుంటే కౌన్సిల్‌లో ఎల్‌డీఎఫ్ ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ఉండేదని ఎల్‌డీఎఫ్ పేర్కొంటోంది. వంద మంది సభ్యులు గల గత కౌన్సిల్‌లో ఎల్‌డీఎఫ్‌కు 53మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 35మంది, కాంగ్రెస్‌కు 10మంది సభ్యులు ఉన్నారు. కొన్ని డివిజన్‌లలో బీజేపీ కూడా కాంగ్రెస్‌కు సాయం చేసినట్టు తెలుస్తోంది. ముట్టడ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థికి 460 ఓట్లు రాగా, కున్నుకుజిలో ఈ సంఖ్య 394గా ఉంది. కార్పొరేషన్‌లో వామపక్షాలను అధికారం నుంచి దూరం చేయాలన్నదే బీజేపీ, యూడీఎఫ్‌ల ఏకైక లక్ష్యంగా ఉందని ఎల్‌డీఎఫ్ పేర్కొంటోంది. అనేక డివిజన్‌లలో ఓట్లు తారుమారైనప్పటికీ, ఈసారి బీజేపీ పూర్తి మెజారిటీ సాధించకుండా కాంగ్రెస్ ఆపలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య పరస్పర మద్దతు, అవగాహన ఉన్నట్టుగా కనిపిస్తున్న ఇటుువంటి ఘటనలు కేవలం తిరువనంతపురంలోనే కాకుండా, కొల్లం, కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజ, పతనం తిట్ట, కన్నూర్ వంటి జిల్లాల్లోనూ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
జాన్ బ్రిట్టాస్ ట్వీట్
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలకు ఎదురుదెబ్బ తగలడం నిజమేనని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కానీ తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ పనితీరుకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన ‘మలుపు తిప్పే’ వ్యాఖ్య, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ చేసిన ‘బీజేపీ చారిత్రక ప్రదర్శన’ వ్యాఖ్యల వెనుక గల వాస్తవం ఏమిటని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 2,13,214 ఓట్లు లభించాయి. 2025లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,65,891 ఓట్లు వచ్చాయి. (అంటే తగ్గాయి). అదే సమయంలో కాంగ్రెస్‌కు వరుసగా 1,84,727 ఓట్లు, 1,25,984 ఓట్లు లభించాయి (తీవ్రంగా పడిపోయాయి), ఇక వామపక్షాలకు వరుసగా 1,29,048 ఓట్లు, 1,67,522 ఓట్లు లభించాయి. (అంటే పెరిగాయి) ఇక్కడ ఈ సమాచారం సందర్భోచితం కాకపోయినా అవగాహన కోసం అందజేసినట్టు బ్రిట్టాస్ ట్వీట్ చేశారు.



