Tuesday, February 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌దే పైచేయి

కాంగ్రెస్‌దే పైచేయి

- Advertisement -

5 కార్పొరేషన్లు, 81 మున్సిపాల్టీలు ‘హస్త’గతం
బీఆర్‌ఎస్‌కు 18, ఇండిపెండెంట్లకు 4
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ, కరీంనగర్‌లో బీజేపీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ పాలక మండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ జోరు కొనసాగింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికల్లో సత్తా చాటింది.మొత్తం 116 మున్సిపాల్టీల్లో కోరం లేక 11 మున్సిపాల్టీల్లో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మిగిలిన 105 మున్సిపాల్టీల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ సందర్భంగా హంగ్‌ ఏర్పడిన మున్సిపాల్టీల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మొత్తం 36 మున్సిపాల్టీల్లో హంగ్‌ ఏర్పడగా, 11 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 25 హంగ్‌ ఏర్పడిన స్థానాల్లో 15 మున్సిపాల్టీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మరో 5 మున్సిపాల్టీల్లో బీఆర్‌ఎస్‌, 4 చోట్ల ఇండిపెండెంట్లు, మరోచోట ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు గెలుచుకున్నాయి. దీనితో కాంగ్రెస్‌పార్టీ గెలిచిన మొత్తం మున్సిపాల్టీల సంఖ్య 81కి చేరింది(ఫలితాల ప్రకటన రోజు కాంగ్రెస్‌ 66 చోట్ల పూర్తి మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే).

బీఆర్‌ఎస్‌ సంఖ్య 18కి పెరిగింది. (ఫలితాల రోజు పూర్తి మెజారిటీతో బీఆర్‌ఎస్‌ 13 చోట్ల గెలిచింది). అలాగే 7 కార్పొనేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఐదింటిని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కరీంనగర్‌లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ కార్పొరేషన్లను దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్లు అదిలాబాద్‌, జమ్మికుంట, మహబూబాబాద్‌, భైంసా మున్సిపాల్టీలను గెలుచుకున్నారు. అయితే వీరంతా కాంగ్రెస్‌ మద్దతుతోనే గెలిచారు. వడ్డేపల్లి మున్సిపాల్టీలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ గుర్తుపై గెలిచిన వారందరూ కాంగ్రెస్‌లో చేరామని ప్రకటించినప్పటికి అధికారికంగా ఎన్నికల సంఘం వారిని గుర్తించలేదు. దాంతో వారు ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచే గెలిచారని ప్రకటించింది. మున్సిపాల్టీల్లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, అదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో హస్తం హవా కొనసాగింది.

ఇక్కడ 80 శాతానికి పైగా చైర్మెన్‌ పదవులను ఆ పార్టీ దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చింది. మెదక్‌ జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాల్టీలో కోరం లేక చైర్మెన్‌ ఎన్నిక వాయిదా పడింది. ఆ జిల్లాలో మిగిలిన 18 స్థానాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చెరో 9 స్థానాలను దక్కించుకున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాల్టీని ఆ పార్టీ కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్‌ మున్సిపాల్టీలో ఒక్క స్థానం దక్కిన కాంగ్రెస్‌కు చైర్మెన్‌ పీఠం దక్కింది. ఇక్కడ మొత్తం 15 వార్డులుండగా.. బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 6, కాంగ్రెస్‌ ఒక్క వార్డులో గెలిచింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవిల ఎక్స్‌ అఫిషియో ఓట్లతో ఆ సంఖ్య మూడుకు చేరింది. వారికి బీజేపీ సభ్యులు మద్దతు పలకడంతో ఒక స్థానంలో గెలిచిన హస్తం అమనగల్‌ను హస్తగతం చేసుకుంది.

5 కార్పొరేషన్లలో ‘హస్తం’
మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ హస్తం జోరు కొనసాగింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్‌ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 5 చోట్ల మేయర్‌ పదవిని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌ మేయర్‌గా ఉమారాణి, రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతిపల్లి ఎల్లయ్య, మంచిర్యాల మేయర్‌గా ధరణి మధుకర్‌, డిప్యూటీ మేయర్‌గా సళ్ల రమ్య మహేశ్‌, మహబూబ్‌నగర్‌ మేయర్‌గా గుమల్‌ మమత, డిప్యూటీ మేయర్‌గా ఎం సురేందర్‌ రెడ్డి, నల్లగొండ మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు.

నిజామాబాద్‌, నల్లగొండ డిప్యూటీ మేయరుగా ఎంఐఎంకు చెందిన సల్మాతాహిన్‌ ఎండీ.అష్రఫ్‌అలీ గెలిచారు. కొత్తగూడెం, నిజామాబాద్‌, నల్లగొండ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవులను ఏఐఎంఐఎం గెలుచుకుంది. కొత్తగూడెం మేయర్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీ కార్పొరేటర్‌ మూడ్‌ గణేశ్‌ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ డిప్యూటీ మేయర్‌ పదవి కాంగ్రెస్‌కు చెందిన సిరిపురపు లలిత కుమారీకి దక్కింది. చివరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు బీజేపీ వశమయ్యాయి. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ మేయర్‌గా, వై.సునీల్‌ రావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

11 మున్సిపాల్టీల్లో ఎన్నిక వాయిదా
రాష్ట్రంలోని11 మున్సిపాల్టీల్లో వివిధ కారణాల వల్ల చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, క్యాతనపల్లి, ఖానాపూర్‌, జహీరాబాద్‌, ఇంద్రేశం, డోర్నకల్‌, జనగామ, తొర్రూర్‌ మున్సిపాల్టీల్లో ఎన్నిక వాయిదా పడ్డట్టు ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కోరం లేక పోవడం, లేదా మరే ఇతర కారణాల వల్ల 16న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడితే ఆ మరుసటి రోజు 17న నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే వాయిదా పడ్డ మున్సిపాల్టీల ఎన్నిక నిర్వహణ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -