ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శ
మట్టత్తూర్‌లో హస్తం గుర్తుతో గెలిచినవారంతా కమలం పార్టీలోకే..
తిరువనంతపురం : కాంగ్రెస్ సంస్థాగతంగా క్షీణించడం కేరళలో బీజేపీికి బలంగా మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ ఎన్నడూ లేని క్షీణ దశకు చేరుకుందని తెలిపారు. త్రిస్సూర్ జిల్లాలోని మట్టత్తూర్ గ్రామ పంచాయితీలో బీజేపీి అధికారంలోకి రావడానికి ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు పార్టీ మారారని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ద్వారా బీజేపీ అత్యధికంగా లాభపడిందని పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సాధారణమే అయినా, కేరళకు కొత్త అని విజయన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన ఒక పోస్టు చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతలను ఉపయోగించుకుని బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. అరుచణా ప్రదేశ్‌లో ఇదే జరిగిందని, అక్కడ ముఖ్యమంత్రితో సహా 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 43 మంది ఆ పార్టీని వీడి బీజేపీిలో చేరారని విజయన్ గుర్తుచేశారు. 2019లో గోవాలో, ఆ తర్వాత మళ్లీ 2021లో పుదుచ్చేరిలో అరుణాచల్ ప్రదేశ్ మోడల్‌ను బీజేపీి పునరావృతం చేసిందని గుర్తు చేశారు. 2019లో గోవాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలో పూర్తిగా విలీనం కాగా, పుదుచ్చేరిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ బేరసారాలు నిర్వహించిందని, కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కేరళలో ఈ నమూనాను అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. గ్రామ పంచాయితీలో ఎల్‌డీఎఫ్ పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీజేపీితో జత కట్టిందని, మట్టత్తూర్ కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యలంతా బీజేపీలోకి ఫిరాయించడం త్వరలో ఒక ప్రవాహంలా మారుతుందని పెర్కొన్నారు. కాంగ్రెస్‌కు వేసిన ఓట్లు బీజేపీకి వేసినట్లుయిందని అన్నారు. కాంగ్రెస్‌ను కొనుగోలు చేయగల ఒక వస్తువుగా బీజేపీి భావిస్తోందన్నారు. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆర్‌ఎస్‌ఎస్‌లోకి చేర్చుకోవడం ద్వారా ప్రజల తీర్పును దెబ్బతీయడానికి బీజేపీి సిద్ధంగా ఉందని విజయన్ హెచ్చరించారు.
కేరళలో బీజేపీని పెంచుతున్న కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -



