కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు 
తదనంతర పరిణామాలకు బాధ్యత పోలీసులదే
పోలీసులు.. మీకు చేతకాకపోతే మాకు వదిలేయండి, మేమే పట్టుకుంటాం.. 
సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు 
నవతెలంగాణ – చింతకాని
మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు సామినేని రామారావుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హత్య చేయించారని తాము ఏనాడు అనలేదని, కానీ తమకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అండ ఉందని కాంగ్రెస్ నాయకులే ప్రచారం చేసుకుంటున్నారని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు అన్నారు. సామినేని రామారావు హత్యకు నిరసనగా మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. చింతకాని చివర నుంచి గ్రామ ప్రధాన వీధుల గుండా స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు నిరసన సాగింది. అక్కడ బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత నిరసన ప్రదర్శన స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. 
చింతకాని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. సామినేని రామారావు హత్య జరిగి నేటికీ ఐదు రోజులు అవుతున్నా.. పోలీసులు విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. రామారావుని పాతర్లపాడు కాంగ్రెస్ గుండాలు అత్యంత పాచవికంగా, దుర్మార్గంగా హత్య చేశారన్నారు. సామినేని రామారావుది రాజకీయ హత్య కాదని కాంగ్రెస్ నాయకులు పదేపదే ఆరోపణలు చేయటంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పాతర్లపాడులో కాంగ్రెస్ గెలవదని నిర్ధారణ కావడంతోనే రామారావుని కాంగ్రెస్ గూండాలు హత్య చేశారన్నారు.
దసరా సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గ్రామము నుంచి భారీ సంఖ్యలో జనం రావటంతో కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోయారని, అందులో భాగంగానే రామారావుని హత్య చేశారన్నారు. సీపీఐ(ఎం) నాయకులకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించారు. మతిభ్రమించే మాట్లాడుతున్నది మేము కాదు.. కాంగ్రెస్ నాయకులేనని, అందుకు పదేపదే తప్పుడు ప్రచారం చేయడమే నిదర్శనం అన్నారు. రామారావు హంతకులను కాపాడేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు. రామారావు హత్య జరిగి ఐదు రోజులు అవుతున్న పోలీసులు ఎందుకు నిందితులను అరెస్టు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందులోనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు. పదేపదే తప్పుడు ప్రచారం చేస్తే హత్య పక్కదారిని పట్టించవచ్చునని ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు రామారావుపై దిగజారి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాలలో హత్యలు జరగలేదా, అక్కడ హత్యలు ఎందుకు జరిగాయి అంటూ కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్నారంటే రామారావు హత్యను పరోక్షంగా తామే చేశామని కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటున్నారన్నారు. పోలీసులకు రెండు మూడు రోజులు గడువు ఇస్తున్నాం.. ఈ గడువులో రామారావు హంతకులను అరెస్టు చేయకపోతే తదనంతరం జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తరువాయి జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


                                    

