డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఘటన
తీవ్రంగా గాయపడ్డ చిన్నకేసి వేణు
మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్, సీపీఐ(ఎం) కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం దాడి చేసిన సంఘటన మండలంలో తీవ్ర చర్చిని అంశముగా మారింది. బాధితులు పదిలం ఉదయ్ కరణ్, చెన్నకేసి సైదమ్మ, చెన్నకేశి వేణు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామపంచాయతీలో సీపీఐ(ఎం) బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి. సీపీఐ(ఎం) మద్దతుతో బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లబోయిన నాగేశ్వరరావు సర్పంచ్ గా విజయం సాధించాడు.
ఈ క్రమంలో సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తో పాటు పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. అనంతరం సీపీఐ(ఎం), బీఆర్ఎస్ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ విజయోత్సవ ర్యాలీ సోమవారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. అయితే కాంగ్రెస్ కు చెందిన మల్లాది లింగయ్య కర్రలు, రాళ్లు తీసుకొని మంగళవారం ఉదయం తన ఇంటి ముందుకు వచ్చి వినటానికి వీలులేని విధంగా బూతులు తిడుతున్నాడని చిన్న కేసి సైదమ్మ తెలిపింది. దీంతో సైదమ్మ కుమారుడు చెన్నకేసి శ్రీకాంత్ పవన్ మా ఇంటి ముందుకు వచ్చి ఎవరిని తిడుతున్నావని మల్లాది లింగయ్యను ప్రశ్నించాడు. దీంతో మల్లాది లింగయ్య, మల్లాది ఉపేందర్, మల్లాది కొండ, దొంతుపోయిన వెంకయ్య ఏందిరా నీకు చెప్పేది అంటూ చిన్నకేసి శ్రీకాంత్ పవన్ పై కర్రలతో, రాళ్లతో దాడి చేసి కొట్టారు. దీంతో శ్రీకాంత్ పవన్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుండటంతో సమీపంలో ఉన్న పదిలం ఉదయ్ కిరణ్ అక్కడకు వచ్చాడు. దీంతో ఉదయ్ కిరణ్ పై కూడా వారందరూ కలిసి దాడి చేశారు.
తనను కిందపడేసి గొంతు మీద కాలేసి హత్య చేసే ప్రయత్నం చేశారని ఉదయ్ కుమార్ తెలిపాడు. ఉదయ్ కుమార్ ను కొడుతుండటంతో అతని భార్య ప్రమీల అక్కడకు వచ్చింది. దీంతో అక్కడికి వచ్చిన ప్రమీలపై కూడా వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం తాడును బలవంతంగా లాగటంతో తెగి కిందపడింది. ఆమె చాతిపై చేతులతో బలంగా కొట్టారు. ఈ సంఘటన సమయంలో అక్కడే ఉన్న చిన్న కేసి వేణు తన జేబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీస్తుండగా మల్లాది ఉపేందర్, మల్లాది కొండ గమనించి వేణు పై కూడా కర్రలతో దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులు కందుల పాపారావు, బుంగ రాములు, పారా వెంకట మోహన్ రావు తమపై పథకం ప్రకారమే దాడి చేపించారని బాధితులు తెలిపారు. దీంతో వేణు తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. పదిలం ఉదయ్ కిరణ్ చొక్కా మొత్తం చినిగిపోయింది. ప్రమీల నైటీ కూడా చింపి వేశారు. దీంతో బాధితుడు పదిలం ఉదయ్ కిరణ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో ఎస్ఐ కేసు నమోదు చేసి బాధితులను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెన్నకేసి వేణు తల పగలటంతో మూడు కుట్లు పడ్డట్లు బాధితులు తెలిపారు. మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు పరామర్శించారు. సంఘటన గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనను లింగాల కమల్ రాజు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ వారిని వెంటనే అరెస్టు చేయాలని కమల్ రాజు పోలీస్ అధికారులను కోరారు.



