లౌకిక పార్టీగా చెప్పుకుంటూ.. మతతత్వ శక్తులతో రాజీ
మోడీ పాలనలో మైనారిటీలపై పెరిగిన దాడులు : సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్ కరత్ ఆరోపణ
కొచ్చి : లౌకిక పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిచోటా మతతత్వ శక్తులతో రాజీ పడుతోందని సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్ కరత్ ఆరోపించారు. ఎర్నాకులం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది లీడర్’ కార్యక్రమంలో కరత్ మాట్లాడుతూ, గత పదేండ్లలో కేరళంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ గణాంకాలను రాష్ట్ర హోంమంత్రే శాసనసభలో సమర్పించారని ఆయన పేర్కొన్నారు. పన్నెండేళ్ల మోడీ పాలన దేశవ్యాప్తంగా మత విభజనకు దారితీసిందని, అనేక రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు సర్వసాధారణమైపోయాయని కరత్ అన్నారు. దశాబ్దకాలంగా కేరళంలో మత సామరస్యం కాపాడటం చిన్న విజయం కాదని, మతతత్వానికి వ్యతిరేకంగా ఎల్‌డీఎఫ్ తీసుకున్న రాజీలేని వైఖరే దీనికి కారణమని ఆయన వాదించారు.
ఈ విషయంలో ఎల్‌డీఎఫ్ మాత్రమే నమ్మదగిన హామీ అని ఆయన అభివర్ణించారు. కేరళంతో సహా నిరంతరాయంగా జరిగిన నిరసనల వల్లే, ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ సవరణల నుంచి బీజేపీ తాత్కాలికంగా వెనక్కి తగ్గవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే జమాత్-ఎ-ఇస్లామీతో సహ మతతత్వ పార్టీలతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంది ఎల్‌డీఎఫ్ కాదని, కాంగ్రెస్ పార్టీయేనని కూడా ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతికూల జోక్యాలను సమర్థవంతంగా ప్రతిఘటించడానికి, పశ్చిమ ఆసియా సంఘర్షణ వల్ల తీవ్రమవుతున్న ఆర్థిక పరిణామాల నుంచి కేరళను గట్టెక్కించడానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని ఆయన వాదించారు.
ప్రస్తుత ఎల్‌పీజీ కొరతను మించి, రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, యుద్ధం ముగిసిన చాలాకాలం తర్వాత కూడా దాని పర్యవసానాలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.కోవిడ్-19, ఇతర సంక్షోభాల సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, సామాన్య ప్రజలను కష్టాల నుంచి కాపాడటానికి లక్షిత చర్యలు చేపట్టడం వంటి ఎల్డీఎఫ్ గత పనితీరును ఉదహరిస్తూ, ఇటువంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ కూటమికి ఉన్న సామర్థ్యానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎదుర్కొన్న వ్యతిరేకత, నిర్లక్ష్యం భవిష్యత్‌లోనూ ఎదురవుతూనే ఉంటుందన్నారు. అయితే అటువంటి ఒత్తిడిని సమర్థవంతంగా ఎదిరించిన చరిత్ర తమ ఫ్రంట్‌కు ఉందని కరత్ స్పష్టంచేశారు.



