నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కే.తారకరామారావు విమర్శించారు. శుక్రవారం ఈ మేరకు ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాగ్ నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని గుర్తుచేశారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం విలాసాలపై దృష్టి సారించారని విమర్శించారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రూ. 3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని విమర్శించారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ట్వీట్
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ జయంతిని గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆటలు మనకు సహకారం, పోరాట స్ఫూర్తిని నేర్పిస్తాయని అన్నారు. ”మనం కిందపడితే అది ముఖ్యం కాదు, మళ్లీ ఎలా పైకి లేచామన్నదే ముఖ్యం” అని పేర్కొన్నారు. కష్టాలను అధిగమించి స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన క్రీడాకారులను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్‌వి అబద్ధాలు : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES