Tuesday, April 29, 2025
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ సమావేశం రసాభాస

కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

– కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తత : మంత్రి పొన్నం అనుచరల ఆగ్రహం
– ఏఐసీసీ కార్యదర్శి ఎదుటే గొడవ
– అర్ధాంతరంగా నిలిచిన పార్టీ సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశం
– జారుకున్న ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు
నవతెలంగాణ – కరీంనగర్‌

ప్రాంతీయ ప్రతినిధికరీంనగర్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ సంస్థాగత, నిర్మాణ సన్నాహకం పేరుతో సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్‌ పేరుమాల్‌ ఎదుటే ఇరు గ్రూపులు గొడవకు దిగాయి. ఏడాది కాలంగా పార్టీ ముఖ్యనేతపై తీవ్ర అసహనంతో ఉన్న కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమళ్ల శ్రీనివాస్‌ ప్రసంగం ప్రారంభించగానే ‘జైపొన్నం’ అంటూ మంత్రి అనుచరులు నినాదాలు చేశారు. అదే సమయంలో మంత్రి పేరు ప్రస్తావించకుండా జిల్లాలో జరుగుతున్న పలు పరిణామాలకు ‘ఆ ఒక్కడే’ కారణం అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘కరీంనగర్‌ నుంచి మార్కెట్‌ కమిటీ కోసం ఫైళ్లు పంపిస్తే అడ్డుకుంటున్నారు. ఏ పనులూ కావడం లేదు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు’ అనగానే పురుమళ్లపై మంత్రి అనుచరులు దాడికి యత్నించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ ఎదుటే గొడవ పడిన కాంగ్రెస్‌ శ్రేణులకు వేదికపై ఉన్న నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం కూడా గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటికే శ్రేణులను సముదాయించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్‌, రఘునాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు వడిదల ప్రణవ్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్‌, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, గతంలోనే మంత్రి పొన్నంను ఉద్దేశిస్తూ కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. కార్యకర్తలతో రహస్య సమావేశమై జిల్లాలో పలు అక్రమాలు, అవినీతి అంశాలు లేవనెత్తుతూ మాట్లాడిన తీరుపై గతంలోనే షోకాజ్‌నోటీసు అందుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img