– ఈ నెల 28 న ఉద్యమకారుల బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ
– TUJAC ప్రధాన కార్యదర్శి కోతి మాధవి
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోతి మాధవి కోరారు. సీతాఫల్మండి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 28 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉద్యమకారుల సభ కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోతి మాధవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ బహిరంగ సభను ఈనెల 28న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఉద్యమకారులు అన్ని జిల్లాల నుంచి తరలి రావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు,రూ. 25000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులు 12 సంవత్సరాలుగా ఉద్యోగం, ఉపాధి లేక కుటుంబాలను నడపలేక రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడిందని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ఉద్యమకారుల పరిస్థితి మారడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమకారులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరో ప్రధాన కార్యదర్శులు ఉండవల్ల శ్రీనివాస్, ఏలూరి బాబన్న, కోచెర్మన్ బత్తుల సాయిబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డోలక్ యాదగిరి, నాయకులు ఎన్ మల్లేశం, నాచం శంకర్, జి రవికుమార్, పి సత్యనారాయణ, కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



