– మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
– హన్మకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల పంపుహౌస్ పరిశీలన
నవతెలంగాణ-హసన్‌పర్తి
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు అందక తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట పరిధిలోని దేవాదుల పంపుహౌస్ పనులను బీఆర్‌ఎస్ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు కేటాయింపులు ఉంటే కేసీఆర్ 60 టీఎంసీలకు పెంచి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47వేల ఎకరాలు మాత్రమేనన్నారు. గతేడాది బీమ్ ఘన్‌పూర్ వద్ద మోటార్లు ఆన్ చేయలేదన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మొదటి ఏడాదిలో ఆరు లక్షలు, రెండో ఏడాది 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని, దాన్ని ఎంత మేర అమలుచేశారని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా వదులుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, దేవాదుల వద్ద నీళ్లు ఎత్తడం లేదని, సీతమ్మ సాగర్ పూర్తికాకుండా అక్కడ వదిలేస్తున్నారని అన్నారు. గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడటంలో రేవంత్‌రెడ్డి ఫెయిలయ్యారని దుయ్యబట్టారు. రెండున్నర ఏండ్ల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదన్నారు. లీకులు తప్ప రైతు భరోసా ఇవ్వడం లేదని, యాసంగికి బోనస్ ఇస్తారా? ఇవ్వరా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తక్షణమే దేవాదుల మోటార్లు నడిపి మూడున్నర లక్షల ఎకరాలకు పంటలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినరు భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, హసన్‌పర్తి మండల అధ్యక్షులు బండి రజినీకుమార్, బీఆర్‌ఎస్ నాయకులు సంగాల విక్టరీ బాబు, సుభాష్‌గౌడ్, చుంచు రవీందర్, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే రైతులకు తీవ్ర అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



