నవతెలంగాణ – గోవిందరావుపేట : కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకటకృష్ణ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలతో మాట్లాడారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) ను రద్దు చేస్తూ పేరు మార్చి (విబి జి రామ్ జి) అనే పేరుతో నామకరణం చేసి కొత్త బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదించడంపై వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 141 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం తెచ్చిన గొప్ప చరిత్ర గల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, అధికారంలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజల కోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ స్థాపించి 140 సంవత్సరాలు పూర్తయి 141వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్రం రావడం కొరకు కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడిందని గుర్తు చేశారు. అధికార బీజేపీ పార్టీ అహంకారంతో ప్రజలను మభ్యపెడుతూ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలని సూచించారు. ప్రజల హక్కులు సంక్షేమ పథకాలను కాపాడేందుకు ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్మికశాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, సర్పంచులు లావుడియా జోగా నాయక్, భూక్య సుమలత, ఉపసర్పంచ్ పెండెం శ్రీకాంత్ గార్లతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.


