Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన

సంక్షేమానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన

- Advertisement -

2 ఏండ్లలో మార్పు చూపించాం
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
సంక్షోభం నుంచి సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం : మంత్రి పొంగులేటి
ఆధునీకరించిన ఐ అండ్‌ పీఆర్‌ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ


నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పాలన అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అన్నారు. ఏ మార్పు కావాలని రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేండ్లలోనే ఆ మార్పు స్పష్టంగా చూపించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా ఆర్థికరంగంలో పెను సంక్షోభమని అన్నారు.

సంక్షోభం నుంచి గట్టెక్కుతూ అభివృద్ది, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్‌ కార్డులు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయని వివరించారు. ఈ మార్పులను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు ఆయన సూచించారు.

హామీ ఇవ్వకున్నా పలు పథకాల అమలు
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని పొంగులేటి చెప్పారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని చెప్పారు. ఆర్థికవృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకుని పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ వ్యూహంతో పాలన సాగుతోందన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్దిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేండ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో జి మల్సూర్‌, సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డిఎస్‌ జగన్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -