– మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న..
– మండలంలో బైక్ ర్యాలీ
– రైతు వేదిక ముందు నిరసన
– సమయపాలన పాటించని వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ – గన్నేరువరం
తెలంగాణలో రైతులకు సరిపడా ఎరువులను అందించలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ తో రైతు వేదిక వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 11 గంటలు అయినప్పటికీ రైతు వేదికలో ఏ ఒక్క సిబ్బంది లేకపోవడంతో గంప వెంకన్న ఏవో కిరణ్మయికి ఫోన్ చేసి విషయం తెలుపగా తాను దారిలో ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసపూరిత వాగ్దానాలతో నాశనం చేసిందని, కనీసం ఎరువులు అందించడం లేదని, మండలంలోని చెరువులు కాలువలు నీరు లేక వెల వెల పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్ పాలనలో కాలేశ్వరం ప్రాజెక్టు తో గన్నేరువరం మండలం సస్యశ్యామలంగా మారిందని, అప్పుడు ఎరువుల కొరత లేదని కొనియాడారు. నేడు కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతు వేదికలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయని వ్యవసాయ అధికారులు కనీసం సమయపాలన పాటించడం లేదని, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని లేని పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బి ఆర్ ఎస్ నాయకులు కొంత సమయం నిరీక్షణ తర్వాత ఏవో కిరణ్మయి రైతు వేదికకు రాగా ఆమెకు వినతి పత్రం అందజేసి రైతులకు ఎరువులు అందేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏవో కిరణ్మయి మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక లోపంతో ఎరువుల తయారీ కాకపోవడం మూలంగా కొరత ఏర్పడిందని, ఇప్పుడు ఆ సమస్య లేదని ఉచిత రవాణా ఉన్న సొసైటీలు, గ్రోమోర్ సెంటర్లకు యూరియా రవాణా జరుగుతుందని అన్నారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, గుండా రాజు, న్యాలపట్ల శంకర్, సమ్మెట అనిల్, బొడ్డు శ్రీనివాస్, గంప మహేష్ అధిక సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.