Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమెదక్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌

మెదక్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ గూటికి సీనియర్‌ నేత సుప్రభాత్‌రావు
– మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గల్లంతు ఖాయం : హరీశ్‌రావు
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్‌ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సి సుప్రభాత్‌ రావు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి, బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్‌ సీనియర్‌ నాయకులు కంఠంరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సుప్రభాత్‌రావు తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి హరీశ్‌రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లోనే కాకుండా ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమనీ, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. రామాయంపేటలో సుప్రభాత్‌రావు చేరికతో బీఆర్‌ఎస్‌ మరింత బలోపేతం అయ్యిందనీ, రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని మున్సిపాల్టీలనూ బీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అన్నారు. సుప్రభాత్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదనీ, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని చెప్పారు. మెదక్‌ జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రామాయంపేటలో గులాబీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్‌ చైర్మెన్‌, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -