పార్టీ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్న ముఖ్యమంత్రి
35 ఏండ్లుగా గెలుస్తున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు
హరీశ్‌రావుకు చెక్ పెట్టేలా వ్యూహాలు
ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కవిత ప్రకటన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సిద్దిపేటలో పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా కేసీఆర్, హరీశ్‌రావు గెలుస్తూ తమ కంచుకోటగా కాపాడుకుంటున్న సిద్దిపేటను హస్తగతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి వ్యుహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. దాంతో సిద్దిపేటలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత సైతం సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, కవిత నూతనంగా ఏర్పాటు చేసే పార్టీ పోటీ పడనున్నాయి.
సీఎం వ్యాక్తలు రాజకీయ చర్చకు తెరలేపారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేండ్లు గడువు ఉన్నప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో పోటీపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇప్పటినుంచే సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్‌రావు ఈ నియోజకవర్గం నుంచి ఓటమి లేకుండా వరుసగా విజయం సాధిస్తూ బీఆర్ఎస్కు కంచుకోటగా మార్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఆయన తన పట్టును నిలబెట్టకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏడు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపులో హరీశ్‌రావుదే కీలక పాత్ర. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ‘సిద్దిపేటలో 35 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి అధికారం కట్టబెట్టారు.. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి’ అని ప్రజలను కోరుతూ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి పరోక్షంగా హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఇందుకు స్పందించిన హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే సిద్దిపేట నుంచి పోటీకి దిగాలని ప్రతి సవాల్ విసిరారు.
సిద్దిపేటలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు..
సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాగైనా హరీశ్‌రావును ఓడించి కాంగ్రెస్ గెలవాలనే లక్ష్యంగా మంత్రి పదవిని నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి ఆశ చూపారు. ఇక ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో నారాయణఖేడ్, మెదక్, అందోలు, హుస్నాబాద్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతున్నారు.
దాంతో ఎలాగైనా సిద్దిపేట నియోజకవర్గంలో హరీశ్‌రావును ఓడించాలని మంత్రి పొన్నం పథకం రచిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటనతోనే బహిర్గతమైంది. కాగా, సంగారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్, జహీరాబాద్, దుబ్బాక, పటాన్చెరు, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పాదయాత్ర-శ్రమదానం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించడంతో పాటు సిద్దిపేట, మెదక్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
హాట్ టాపిక్‌గా కవిత ప్రకటన
సిద్దిపేట నుంచి తానూ పోటీ చేస్తానని కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటన ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను సిద్దిపేట బిడ్డనని, ఎవరో వచ్చి ఇక్కడ పోటీ చేయడమేంటని, బీఆర్ఎస్ పార్టీ ద్రోహులకు తగిన బుద్ధి చెబుతానని ప్రకటించారు. ఎన్నికల్లో కవిత పోటీ చేస్తే హరీశ్‌రావుకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా సిద్దిపేట జిల్లా కేంద్రం శివారులో కార్యాలయం నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా కవిత పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోవడం ఖాయమని సిద్దిపేట వాసులు పేర్కొంటున్నారు.



