– దసరా తర్వాత హెచ్‌ఎంఎస్‌తో కలిసి యాత్ర : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి సంస్థను కాంగ్రెస్ పార్టీ కరప్షన్ గనిగా మార్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల జాగృతి కార్యాలయంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని విమర్శించారు. సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ సింగరేణిలో రాజకీయ అవినీతిని అంతం చేశారనీ, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మళ్లీ పెరిగిందని ఆరోపించారు. సింగరేణి సంస్థను కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి మార్చాలని డిమాండ్ చేశారు. కార్మికులకు భరోసా ఇవ్వడానికి హెచ్‌ఎంఎస్‌తో కలిసి త్వరలో సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. కార్మికుల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతామని స్పష్టం చేశారు. బోనస్ విషయంలో కార్మికులను ఆ పార్టీ నయవంచనకు గురిచేసిందని ఆరోపించారు. లాభాల్లో 33 శాతం వాటా బోనస్‌గా ఇస్తున్నామని చెప్పి… లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దసరా బోనస్ లాభాల్లో 37 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థ ఉద్యోగులపై విధిస్తున్న ఆదాయపు పన్ను.. రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైలెవల్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సింగరేణిని కరప్షన్ గనిగా మార్చిన కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES