Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్ల పెంపుపై నీళ్లు చల్లిన కాంగ్రెస్‌

బీసీ రిజర్వేషన్ల పెంపుపై నీళ్లు చల్లిన కాంగ్రెస్‌

- Advertisement -

మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం 46 జీవో ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నీళ్లు చల్లిందని శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ చెప్పింది ఒకటి చేసింది మరొకటి అని అన్నారు. తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చివరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చేతులెత్తేసిందని చెప్పారు. కులగణన తప్పుగా జరిగినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయనే ఆశతోనే తాము ఉభయ సభల్లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. చివరకు పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు వెళ్తామనీ, పార్టీ తరపున రిజర్వేషన్లు ఇస్తామని క్యాబినెట్‌లో ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లకు క్యాబినెట్‌ నిర్ణయాలకు సంబంధమేంటనీ అడిగారు. రూ.మూడు వేల కోట్ల నిధుల కోసం నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో బీసీ బిల్లు కోసం ఉద్యమిద్దామని ఆయన పిలుపునిచ్చారు. చట్టబద్ధతతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమని అన్నారు. 46 జీవోను రద్దు చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు.

మోసానికి కాంగ్రెస్‌ ప్రతీక : మధుసూదనాచారి
మోసానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రతీక అని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు చేసిన మోసానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు పోరాటంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తూ తీర్మానిం చామని చెప్పారు. మాజీ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీసీలను కాంగ్రెస్‌ అడుగడుగునా మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ మోసం పై దశల వారీగా పోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో ప్రయివేటు బిల్లు ప్రవేశ పెడతారని అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో బీసీల రిజర్వుడు స్థానాలు చాలా తగ్గాయని మాజీ మంత్రి జోగు రామన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు వినరు భాస్కర్‌, తుల ఉమ, కె కిషోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -