Sunday, February 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ గెలుపు గుడ్డిలో మెల్ల

కాంగ్రెస్‌ గెలుపు గుడ్డిలో మెల్ల

- Advertisement -

– అధికార పార్టీపై మాజీ మంత్రి తలసాని ఎద్దేవా
నవతెలంగాణ-సిద్ధిపేట

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుడ్డిలో మెల్లగా గెలిచిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నదని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలోకి కేసీఆర్‌ తీసుకువస్తే, నేటి సీఎం రేవంత్‌ రెడ్డి అథోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దొంగ మాటలు, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. తాను టీడీపీలో ఉన్న సమయంలో నాలుగైదు గంటలు కరెంటు వచ్చేదని, నీటి సమస్య ఉండేదన్నారు. కానీ కేసీఆర్‌ 24 గంటల కరెంటు ఇచ్చి, తాగు, సాగు నీరుకు ఇబ్బందులేకుండా ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. సిద్దిపేటను హరీశ్‌రావు బాగా అభివద్ధి చేశారనీ, రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా సిద్దిపేటకు తీసుకువచ్చే వారన్నారు. కేసీఆర్‌ హయాంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటితే.. కాంగ్రెస్‌ హయాంలో భూముల ధరలు పడిపోయాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికలలో డబ్బులు మద్యం ఏరులై పారిందన్నారు. తమ కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేశారని, ఓడిన వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, నాయకులు కొండం సంపత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -