Monday, November 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

- Advertisement -

ఫర్నీచర్‌ ధ్వంసం
మణుగూరులో 144 సెక్షన్‌ అమలు

నవతెలంగాణ-మణుగూరు
బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసి, విలువైన ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో 2వ సారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు 2021లో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మణుగూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకు న్నారంటూ పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్‌ నాయకులు సుందరయ్య నగర్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఉన్న యువజన నాయకులపై దాడి చేసి కొట్టారు. విలువైన ఫర్నీచర్‌ తగలబెట్టారు. ఈ సందర్భంగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో చుట్టూ ఉన్న నివాస గృహాల్లో ప్రజలు, చిన్నపిల్లలు అవస్థతకు గురయ్యారు. మంటల కారణంగా పైన ఉన్న విద్యుత్‌ తీగలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ నిలిచిపోయింది. ఫస్ట్‌ ఫ్లోర్‌లో హార్ట్‌ పేషెంట్‌ ఉన్నారు. ఆమెని సమయస్ఫూర్తితో స్థానికులు పక్క ఇంట్లోకి తరలించారు. ఈ పరిస్థితితో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా పట్టణమంతా ఉలిక్కిపడింది.

ఉదయం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజాభవన్‌ చేరుకున్నారు. 9 గంటల నుంచి 11 గంటల వరకూ విధ్వంసం సృష్టించారు. కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆక్రమించారని ఆగ్రహంతో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా తెలంగాణ భవన్‌ పేరును మూసివేసి ఇందిరమ్మ భవన్‌ అనే బోర్డును ఏర్పాటు చేశారు. జెండా దిమ్మెకు కాంగ్రెస్‌ కలర్‌ వేశారు. పార్టీ కార్యాలయం భవనానికి కూడా రంగులు వేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రెచ్చిపోయిన కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ దిమ్మెకు కాంగ్రెస్‌ కలర్‌ వేశారు. పార్టీ కార్యాలయం అంతర్భాగంలో ఉన్న గోడలకు వైట్‌ కలర్‌ వేశారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పార్టీ కార్యాలయాన్ని తమకు అప్పచెప్పేంత వరకూ ఇక్కడ నుండి కదిలేది లేదని కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు రోడ్డుపైన అడ్డుకున్నారు. అందుబాటులో లేని సందర్భాన్ని చూసి పార్టీ కార్యాలయంపై దాడి చేశారని, ఇది పిరికిపంద చర్య అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తామని తెలపడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓఎస్‌డీ నరేందర్‌, డీఎస్‌పీ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు. అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన గురవుతున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -