అక్రమ వలసదారులకు సహకారం
అధికారం కోసమే సర్‌కు అడ్డు
ప్రధాని మోడీ విమర్శలు
దిబ్రూగఢ్ : అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆ పార్టీ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా వస్తున్న వలసదారులు అసోంలో స్థిరపడేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని ఆయన విమర్శించా రు. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూ.10,601 కోట్లతో నిర్మించిన ఎరువుల తయారీ కర్మాగారాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు.
బంగ్లాదేశ్ వలసదారులకు అసోంలో ఆశ్రయం కల్పించడం ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును పెంచుకో వాలనే ఉద్దేశంతో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల గుర్తింపు, ఉనికి, ఆత్మగౌరవం గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రమూ పట్టింపు లేదని విమర్శించారు. ”సర్ ప్రక్రియను అడ్డుకునేందకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ప్రయత్నిస్తోంది. నేనేం మంచి చేయాలనుకున్నా.. దానికి మోకాలడ్డుతోంది. ప్రజల గౌరవం, ఉనికిని కాపాడేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి అసోంను కచ్చితంగా రక్షించాల్సిన అవసరం ఉంది. అందుకు బీజేపీ ఓ రక్షణ కవచంలా నిలుస్తుంది” అని మోడీ తెలిపారు. అసోం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ బీజేపీ ఇప్పటి నుంచే ప్రచార తీవ్రతను పెంచింది. ఇందులో భాగంగా అసోంలో అభివృద్ధి పనుల పేరిట ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ విమర్శలకు దిగుతున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.



