Wednesday, April 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరంపై కాంగ్రెస్‌ పగ

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ పగ

- Advertisement -

– కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం
– కాంగ్రెస్‌, బీజేపీది ఫెవికాల్‌ బంధం
– ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత కరువు
– దిశానిర్దేశం లేకుండా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు
– రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఎథిక్స్‌ కమిటీకి పంపాలి
– పొంగులేటి అవినీతిని బయటపెట్టినందుకే మా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ : మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగబట్టిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో రైతులకు శిక్ష వేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ మీద ద్వేషం ఉంటే తమకు శిక్ష వేయాలనీ, రైతుల పొట్ట కొట్టొద్దని కోరారు. తక్షణమే నిధులను విడుదల చేసి కాలువలకు నీళ్లు వదలాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న భాషలాగే ఉన్నాయనీ, బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్‌, బీజేపీల ఫెవికాల్‌ బంధం బయటపడిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.90 వేల కోట్లు, రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి ఎలా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం 2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకకరాల్లో ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని వివరించారు. భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు కాలువలకు వెళ్లి నీళ్లు వదులుతున్నారనీ,అవి కాళేశ్వరం నీళ్లు కావా?అని ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారనీ, అది కాళేశ్వరంలో భాగం కాదా? అని అడిగారు. హైదరాబాద్‌కు తాగునీటి కోసం మూసీ పక్కనుంచి 20 టీఎంసీల నీళ్లు తేవడం కోసం రూ.ఎనిమిది వేల కోట్లతో కాలువలు తవ్వుతున్నారనీ, మల్లన్న సాగర్‌ నుంచి ఆ నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌ వెళ్లి సాగునీటిని, పంటలను చూద్దామనీ, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో రైతులను అడుగుదామని కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, కిషన్‌రెడ్డి, బండి సంజరుతోపాటు కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. రూ.50 కోట్లు విడుదల చేస్తే కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంద న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిధులివ్వకుండా పగబట్టిందని విమర్శించారు.

తూతూమంత్రంగా అసెంబ్లీ
దిశా నిర్దేశం లేకుండా తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయని హరీశ్‌రావు అన్నారు. ఆరు గ్యారెంటీలపై స్పష్టత కరువైందని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చకు పారిపోయి, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీని అర్థాంతరంగా ముగించారని విమర్శించారు. మంత్రి పొంగులేటి అవినీతిని ఆధారాలతో బయటపెడితే డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారని అన్నారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాడిన అహంకారపూరిత, వీధి రౌడీల భాషను ఎథిక్స్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. అన్ని వర్గాల పక్షాన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిందని చెప్పారు. తమకు శాసనసభ మాత్రమే వేదిక కాదనీ, ప్రజాక్షేత్రంలో అన్ని వేదికలపైనా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, విజయుడు, బి లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -