మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయన ఉండటం దౌర్భాగ్యమంటూ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తమ్‌లకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంప్ హౌజ్‌లను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం చెల్లదంటూ హితవు పలికారు. ఈ మాత్రం కామన్‌సెన్స్ కూడా లేకుంటే ఎట్లా? అని ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్‌లే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లని విమర్శించారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే.. మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని తెలిపారు. ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప, ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదనీ, ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదని చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమిషన్ల కోసమేనంటూ అదే పనిగా కారుకూతలు కూస్తున్నారనీ, తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని ఫిబ్రవరి 18, 2015, మార్చి4, 2015 సీడబ్ల్యూసీ రాసిన లేఖలో పేర్కొన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, 19నెలల్లో ఏ పని చేయకుండానే రూ.38,500 కోట్లకు అంచనాలు పెంచారని గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పుడు రూ.40,300 కోట్లకు పెంచారనీ, ఏ పని చేయకుండానే అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఏడేండ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేశామంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని తెలిపారు. తెలంగాణ జీవ ధార కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు, ఎక్కడ వాస్తవాలు చెప్పడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ముందే ఎలా ప్రకటిస్తున్నారు? ఆయన మనసులో ఉన్న కుట్రకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు.
కాళేశ్వరంపైకాంగ్రెస్ దుష్ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES