Sunday, May 11, 2025
Homeసీరియల్భయాన్ని జయించు

భయాన్ని జయించు

- Advertisement -

వినడం మాత్రమే కాదు అర్ధం చేసుకోవడం కూడా ముఖ్యమే. పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం. తర్వాత సమాజంలో మనం ఎదుగుతున్న కొద్దీ ‘భయం’ అనే పొర మన చుట్టూ ఆవరించి మనం అందులోనే వుండేలా చేస్తుంది. అది ‘మతం, కులం’ మరేదైనా కావొచ్చు. ఒక మతానికి చెందిన వ్యక్తిని ఇంకో మతం వాడు ఏదైనా అంటే భయం, ఓ కులం వాడు ఇంకో కులం వాడిని ఏదైన అంటే భయం. ఊపిరి పీల్చుకొని మొదటిసారిగా ఏడ్చిన మనం చివరికి ఊపిరివదిలి అందరిని ఏడిపిస్తాం… ఎంత ఆశ్చర్యం. శైశవంలో మన చుట్టూ వున్న వారిలో ఆనందం, వద్ధాప్యంలో మన చుట్టూ వున్న వారిలో ఉద్వేగం, ఉద్విగం, బాధ ఇవి సహజాతాలు.
పరీక్ష రాయడానికి తరగతి గదిలోకి వెళ్ళిన విద్యార్ధికి ప్రశ్నాపత్రం చూసేంత వరకు భయం. పురిటినొప్పులతో బాధపడే స్త్రీకి ప్రసవం అయ్యేంత వరకు భయం. ఆపరేషన్‌ థియేటర్‌లో టేబుల్‌ పైన వున్న రోగికి భయం. ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆలస్యం అయితే బస్సు, రైలు, విమానం దొరకదనే భయం. ఒకవేళ ఇంటికి తాళం చేసి ఊరికి వెళ్ళినా ఇంట్లో దొంగలు పడతారేమోనని భయం. ఇలా కుక్క, పాము, క్రూర మగం వంటి వాటికి భయపడతాం. ఇన్ని భయాల మధ్య మనం నిరంతరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సష్టిలో భయం ఒక్క మనిషికే కాదు, అన్ని ప్రాణులకు వుంటుంది. కాకపోతే మనిషి భయాన్ని వ్యక్తం చేయగలడు (స్పందించగలడు), జంతువులు వ్యక్తం చేయలేవు అంతే తేడా.
పరీక్షలు రాసిన విద్యార్ధి, ఫలితాలు వచ్చేంత వరకు కొద్దిపాటి ఉత్సుకత, ఓ మోస్తారు భయంతోనే ఫలితాల కోసం నిరీక్షిస్తాడు. ఈ మధ్య కాలంలో రాజస్థాన్‌ కోటలో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం, అలాగే వార్షిక పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కొద్దిమంది భయానికి, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే వున్నాం. అంటే ఆ సమయంలో వీరికి సరైన మార్గదర్శకత్వం (Counselling,Guidence) లభిస్తే వారు ఆ ఆలోచన నుండి బయటికి రాగల్గుతారు. అలాంటి వారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పసిగట్టి పర్యవేక్షిస్తే పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను తప్పించిన వారమవుతాం. మరి ఈ భయాల్లో పెద్దది ‘చావు’ భయం. అది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. కానీ దాని గురించి పట్టించుకోకుండా దినచర్యలు పూర్తి చేస్తూనే వుంటాం.
మరి అలాంటప్పుడు ఎందుకు, ఎవరికి, దేనికి భయపడాలి? అన్న ప్రశ్నలు వేసుకోవాలి. కోపాన్ని జయించిన వారు భయాన్ని కూడా జయిస్తారు. ఎందుకంటే భయం మనిషి సహజ గుణం . అది నియంత్రణలో లేకపోతే ఎన్నో అనర్ధాలు జరిగిన దాఖలాలు వున్నాయి. ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుందాం. జర్మన్‌ నియంత హిట్లర్‌ పోలాండ్‌పై దాడి (1939 సెప్టెంబర్‌ -1) మొదలుపెట్టగానే అవకాశం కోసం చూసిన మిత్ర రాజ్యాలు ఆత్మరక్షణగా జర్మన్‌పై యుద్ధం ప్రకటించాయి. చివరికి ఆ యుద్ధంలో అమెరికా ప్రవేశించడం, జపాన్‌లోని హిరోషిమా, (1945 ఆగస్ట్‌ 6) నాగసాకి (1945 ఆగస్ట్‌ 9) పట్టణాలపై (లిటిల్‌ బారు, ఫ్యాట్‌ మ్యాన్‌) అణుబాంబులు వేయడం అందరికి తెలిసిందే. వీటి తాకిడికి జపాన్‌ లొంగిపోవడం, ఈ చర్య వల్ల భయానికి గురైన హిట్లర్‌ చివరికి భంకర్లో ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ఇటలీలో ముస్సోలిని భయంతో పారిపోతుండగా నిరసనకారులు పట్టుకొని ఇటలీ వీధుల్లో బహిరంగంగా ఉరి వేయడం మనకు తెలిసినదే. ఇక్కడ పాలకుడు, మనిషి.. ఎవరైనా కావొచ్చు భయం దేనివల్ల కలుగుతుందో పై సందార్భాలను బట్టి ఊహించుకోవచ్చు.
భయం సహజమైనదే ఐనప్పటికీ మితిమీరిన భయాన్ని దరిచేరనీయకుండా ఓ ప్రణాళికను ముందు పెట్టుకొని ప్రతిరోజు సాధన (జుఞవతీషఱరవ) చేయండి. లక్ష్యం ఏదైనా కావొచ్చు, ఎంతపెద్దదైనా కావొచ్చు, ‘వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది’ అన్న మహాకవి మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ముందుకు కదిలితే తప్పకుండా విజయం వరిస్తుంది. మన దేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చిన పోర్చుగీసు నావికుడు (తొలి యురోపియన్‌) వాస్కోడిగామ (1498, మే 20) ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణించి ఎంతటి కఠినమైన సాహసయాత్ర చేసి కేరళ తీరం చేరుకున్నాడో ఓసారి ఆలోచించండి? మరి మనం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని మనస్సులో ఏదో ఒక మూలన భయంతో అలాగే ఉండిపోతున్నాం. కాలుముందుకు కదలదు, అడుగు ముందుకుపడదు. ఒక్క అడుగు ముందుకువేసి చూడండి భయం దానంతట అదే పారిపోతుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి భయపడిన ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవుడు వద్దని వారించినా అభిమన్యుడు దైర్యంతో పద్మవ్యూహంలోకి వెళ్ళి వీరమరణం పొందుతాడు. ‘ప్రయత్నించి మరణిస్తే విజయం సాధించినట్లే, ప్రయత్నించకుండా మరణిస్తే ఓడిపోయినట్లే’. అందుకే మీ లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి ఓడిపోయినా భయపడకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి ఎక్కడెక్కడ తప్పిదాలు చేశారో పునః సమీక్ష చేసుకొని ముందుకు కదలండి. తప్పకుండా గెలుపు పిలుపు వినిపిస్తుంది.
కాబట్టి చిన్న చిన్న భయాలను పక్కన పెట్టి మీ సుదీర్ఘ లక్ష్యాలను సాధించడానికి ముందుకు కదలండి. జీవితమే ఓ యుద్ధ క్షేత్రం. అందులో పిరికివాడు ప్రతిరోజు చస్తాడు. వీరుడు మరణించినా చిరంజీవిలా అతడి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. నువ్వు అలాగే పోరాడు… విజయం తప్పక వరిస్తుంది. భయం దానంతట అదే పారిపోతుంది.

  • డా||మహ్మద్‌ హసన్‌,
    9908059234
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -