Saturday, November 22, 2025
E-PAPER
Homeకథమనస్సాక్షి

మనస్సాక్షి

- Advertisement -

ప్రత్యూషపు వేళ. ఆ సమయంలో మేము ప్రయాణిస్తున్న జీపు గాలి కొండ అడవిలోకి ప్రవేశించింది. ప్రభాత సమయం కావడంతో అడవంతా ప్రశాంతంగా ఉంది. దూరంగా పక్షుల కిలకిలా రావాలు, మధ్యలో కోకిల కలకూజితాలు ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. అడవిలో ఇరుగ్గా ఉన్న దారి తలలోని పాపిడిలా కనిపిస్తోంది. బాట కిరువైపులా దట్టంగా యూకలిఫ్టస్‌ చెట్లు, పెద్ద పెద్ద పొదలు, వాటి మధ్యలో ఏటవాలుగా పడే భానుడి అరుణ కిరణాలతో అక్కడి దశ్యం ఆహ్లాదకరంగా ఉంది.
బాట ఇరుగ్గా ఉండడంతో జీపుని డ్రైవర్‌ రాజు మెల్లగా, జాగ్రత్తగా నడుపుతునాడు. నేను చాలా రోజుల నుంచి ఈ అడవికి వద్దామనుకుంటున్నా, నా ఉద్యోగంలో తీరిక లేని పనులవల్ల అది వాయిదా పడుతూ వచ్చి ఇన్నాళ్లకు కుదిరింది. నేను ఈ జిల్లా పట్నంలోని ఓ ఫార్మా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నాను. మా కంపెనీలో మందులకు అవసరమైన కాల్షియమ్‌, పొటాషియంలను తయారు చేస్తాం.
ఈ మధ్యనే మా అబ్బాయికి ఐఐటీ లో సీట్‌ రావడంతో వాడు ముంబై వెళ్ళిపోయాడు. నా భార్య సుధేష్ణ వాళ్ళ తమ్ముడి కూతురి పెళ్ళికి హైదరాబాద్‌ వెళ్ళిపోయింది. మా కంపెనీ రెండు నెలల క్రితం కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీ కోసం పేపర్లలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. పది ఉద్యోగాల కోసం రెండు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసారు. మా కంపెనీ నాకు ఆ ఉద్యోగాల ఎంపిక బాధ్యత అప్పగించింది. అందుకే నెల రోజుల నుంచి నేను చాలా బిజీ గా ఉన్నాను. రాత పరీక్షలో వంద మంది ఎంపికయ్యారు. వాళ్లకు పది రోజుల నుంచి నేను, మా పర్సనల్‌ మేనేజర్‌ రఘురాం, అకౌంట్స్‌ ఆఫీసర్‌ వేణు కలసి ఇంటర్వ్యూలు నిర్వహించాం. అవి నిన్ననే పూర్తయ్యాయి. అందుకే రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఈ అడవికి బయలుదేరాను.
నేను ఐదేళ్ల క్రితం ఈ కంపెనీలో చేరిన దగ్గర్నుంచి ఈ అడవిని చూడాలని ఎంత ప్రయత్నించినా ఇప్పటికి గాని కుదరలేదు. ఈ అడవిలో ఓ ఎత్తైన అందమైన జలపాతంతో పాటు లేళ్ళు, దుప్పులు, ఏనుగులు, పులులు లాంటి ఎన్నో రకాల జంతువులు, నెమళ్ళు, సైబేరియన్‌ కొంగలు, పాలపిట్ట, కలివికోడి లాంటి పక్షులు ఉన్నాయని నా స్నేహితులు చెప్పడంతో అప్పటినుంచి ఈ అడవికి రావాలని నాలో కుతూహలం పెరిగింది. కానీ అది ఈ రోజు వరకు కుదరలేదు. ఎలాగైతేనేం ఈ రోజు ఆ కోరిక తీరబోతోంది.
నేను వచ్చే ముందు జిల్లా అటవీ అధికారి రాఘవన్‌ తో మాటలాడటం వల్ల నాకు ఈ అడవిలో ఉన్న అటవీ శాఖ వాళ్ల విడిది గహంలో బస చేయడానికి అనుమతి లభించింది. మేం ఒక గంట తరువాత అరణ్యం మధ్యలో ఉన్న ఆ విడిది గహానికి చేరుకున్నాం. నేను వస్తున్నానని రాఘవన్‌ ముందే చెప్పడం వల్ల కాబోలు నా కోసం అక్కడ ఇద్దరు ఫారెస్టు గార్డులు ఎదురుచూస్తూ కనిపించారు. పచ్చటి అరణ్యంలో ఏటి ఒడ్డున ఉన్న ఆ విడిది గహాన్ని చూస్తుంటే నాకు రామాయణం లోని ‘పంచవటి పర్ణశాల’ గుర్తుకొచ్చింది. పక్కనే గలగల మంటూ బండరాళ్ల మధ్యగా ప్రవహిస్తున్న సెలయేరు ఆ ప్రభాత సమయంలో భూపాల రాగాన్ని ఆలపిస్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో నాకు నేనెప్పుడో డిగ్రీలో చదివిన ”=ఱఙవతీర aతీవ అa్‌బతీవ్ణర రశీఅస్త్ర” అన్న వాక్యం గుర్తుకొచ్చింది.
నేను వెంటనే ఫ్రెష్‌ అప్‌ అవగానే రమణ అనే గార్డు వచ్చి నాకు ఫలహారం ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడి వంటవాడు చేసిన ఉప్మా నాకు ఎంతో రుచిగా అనిపించింది. ఉప్మాని తింటూ రమణతో నేను ఆ అడవి గురించిన వివరాలు అడగటం మొదలుపెట్టాను .
”రమణ గారు, ఈ అడవిలో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి?” అని అడిగాను.
”సార్‌, మీరొస్తున్నట్లు మా డీఎఫ్‌ఓ గారు ఫోన్‌ చేసి చెప్పారు. ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నల్ల కొండలు ఉన్నాయి. దాని పక్కనే ఓ పెద్ద లోయ ఉంది. అక్కడే నల్ల కొండ జలపాతం ఉంది. అది అర కిలోమీటరు ఎత్తునుంచి లోయలోకి పడుతుంటుంది. ఆ జలపాతమే ఇప్పుడు మన గెస్ట్‌హౌస్‌ వెనక పారుతున్న ఏరు. కానీ అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అక్కడికి మా అటవీ శాఖ వాళ్ళు తప్ప బయట వాళ్లకు ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే అక్కడ పులులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకు ప్రమాదం. మీరు ఆ జలపాతాన్ని చూస్తానంటే నేను అక్కడికి మా జీపులో తీసికెళతాను” అని చెప్పాడు రమణ.
”అటువంటి అందమైన ప్రకతి దశ్యాలను చూడాలనే ఇక్కడికి వచ్చాను. పదండి నేను వస్తాను” అన్నాను అతనితో.
ఆ తరువాత నేను మా జీపు డ్రైవర్‌ రాజుని అక్కడే ఉండమని చెప్పి గార్డు రమణతో వాళ్ళ అటవీ శాఖ జీపులో బయలుదేరాను. కొద్ది సేపటికి జీపు ఇరుకైన మార్గంలోకి ప్రవేశించింది. చుట్టూ దట్టమైన అడవి. దూరంగా ఎత్తైన కొండలు. రమణ జాగ్రత్తగా జీపుని నడుపుతునాడు.
గంట తరువాత మేం నల్ల కొండ దగ్గరికి చేరుకున్నాం. అక్కడ కొండ వాలులో జీపుని ఆపేడు రమణ. దూరంగా ఎత్తైన కొండ మీద నుంచి తెల్లటి జలధార కిందకు ఉరుకుతూ కనిపిస్తోంది. దాని శబ్దం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తోంది.
”సార్‌, అదే నల్ల కొండ జలపాతం. ఈ చుట్టూ ఉన్న కొండలనే నల్ల కొండలు అంటారు. కానీ మనం చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పులులు ఆ జలపాతం దగ్గరికి నీళ్లు తాగటానికి వస్తుంటాయి. వాటికి మనం కంట పడ్డామో చాలా ప్రమాదం” అంటూ అతను ఆ జలపాతం వైపు నడవటం మొదలు పెట్టాడు.
అతని మాటలు నాకు భయం కలిగించాయి. అందుకే చుట్టూ భయం భయంగా చూస్తూ నడవసాగాను. రాను రాను ఆ జలపాతపు హోరు పెద్దగా వినిపించసాగింది.
”రమణా, ఈ అడవిలో ఎన్ని పులులున్నాయి? ఈ ప్రదేశాన్ని అభివద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా” అనీ అడిగాను.
”ఈ అడవిలో మేం రెండేళ్ల క్రితం పగ్‌ మార్క్స్‌ సర్వే చేస్తే పది పులుల వరకు ఉన్నట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వం ఈ అడవిని ఈ మధ్యనే రిజర్వు ఫారెస్టుగా ప్రకటించింది. త్వరలో దీన్ని పులుల అభయారణ్యంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి పర్యాటక ప్రదేశానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు” అన్నాడు రమణ.
పది నిముషాల నడక తరువాత మేం ఆ జలపాతం దగ్గరకు చేరుకున్నాం. ఆకాశాన్ని తాకుతూ పచ్చటి కొండలు, పక్కనే హరిత వర్ణపు లోయ, ఆ కొండల మీదనుంచి లోయలోకి ఉరుకుతున్న జలపాతం, లోయ మీద తెల్లటి దోబూచులాడుతున్న మేఘాలు, లోయలో ఎగురుతున్న పక్షులతో అక్కడి ప్రకతి దశ్యం అద్భుతంగా కనిపించసాగింది. ఆ జలపాతం హోరు లోయంతా ప్రతిధ్వనిస్తోంది. మొత్తానికి ఆ దశ్యాన్ని చూస్తుంటే ఒక అందమైన వర్ణ చిత్రంలా కనిపించసాగింది.
అక్కడ మేమిద్దరం చాలా సేపు ఉండి ఆ జలపాతాన్ని తనివితీరా వీక్షించి ఆ తరువాత నడుస్తూ జీపు దగ్గరికి బయలుదేరాం. నడుస్తూ ఉంటే నాకు పులి వస్తుందేమోనని భయం వేసింది. అందుకే చుట్టూ చూస్తూ నడవసాగాను. కొద్ది దూరం వెళ్ళగానే రమణ ఒక్కసారిగా ”సార్‌, పులి వస్తోంది. పరిగెత్తండి” అంటూ గట్టిగా అరిచాడు.

నేను వెంటనే పక్కకి చూసాను. దూరంగా పచ్చటి శరీరంపై నల్లటి చారలున్న పెద్ద పులి పరిగెడుతూ మా వైపు వస్తూ కనిపించింది. అంతే! దాన్ని చూడగానే నా గొంతు తడారిపోయింది. నా కాళ్ళు వణకటం మొదలైంది. వెంటనే పెద్దగా అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాను. గార్డు రమణ అప్పటికే పరుగు లంఘించుకున్నాడు. ప్రాణం మీదకు వస్తే అంతే మరి. పరిగెడుతున్నానే కానీ నా కాళ్ళు తడబడుతున్నాయి. శరీరం మొత్తం వణుకుతోంది. అయినా పరుగు ఆపలేదు. కానీ ఆ పులి వాయు వేగంతో మా దగ్గరకు వస్తోంది. దాని వేగంతో నేను పోటీ పడలేకపోతున్నాను. జీపు ఇంకా చాలా దూరంలో ఉంది. దాన్ని చేరుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చు. కానీ అది జరిగే పనిలా కనిపించటం లేదు. ఎందుకంటే ఆ పులి వాయువేగంతో నా మీదకు వస్తోంది.ఇంతలో నా కాళ్లకు ఏవో తుప్పలు అడ్డొచ్చి ఒక్కసారిగా బోర్లా పడిపోయాను. అప్పుడు ఢాం, ఢాం అన్న శబ్దాలు నాకు పెద్ద శబ్దంతో వినిపించాయి. అప్పటికే నాకు స్పహ తప్పి, కళ్ళు మూతలు పడి పోసాగాయి.ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.

రెండు గంటల తరువాత నేను కళ్ళు తెరిచాను. ఎదురుగుండా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్లలో ఒకరు గార్డు రమణ .రెండవ వ్యక్తి ఒక పాతికేళ్ల యువకుడు. అతన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తునాది. కానీ గుర్తుకు రావటం లేదు. అప్పుడు రమణ నాకు మంచి నీళ్లు ఇచ్చాడు. అవి తాగిన తరువాత నాకు పూర్తిగా తెలివి వచ్చింది.
”రమణా, ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? నీ పక్కన ఉన్నది ఎవరు?” అని అడిగాను.
”సార్‌, మనం ఇప్పుడు మా గెస్ట్‌ హౌస్‌లో ఉన్నాం. పులిని చూసి మీరు పరిగెడుతూ కింద పడిపోయారు. కొద్ది క్షణాలు గడిస్తే పులి మిమ్మల్ని కరుచుకొని వెళ్ళిపోయి ఉండేది. కానీ ఈ గిరిజన యువకుడు కట్టెల కోసం ఈ అడవిలోని ఈ లోయ దగ్గరకు వచ్చాడు. ఈ యువకుడిది ఈ పక్కనే ఉన్న అడ్డశిల అనే తండా. అతని దగ్గర అదష్టవశాత్తు తుపాకీ ఉంది. మిమ్మల్ని పులి వెంటపెడుతున్న దశ్యం ఇతని కంట పడి తుపాకీని గాల్లోకి పేల్చాడు. ఆ శబ్దానికి అది భయపడి పారిపోవడంతో మీరు బతికిపొయారు. లేకపోతే చాలా ఘోరం జరిగిపోయి ఉండేది” అంటూ జరిగింది చెప్పాడు రమణ.
నేను వెంటనే ఆ యువకుడి వైపు తిరిగి ”నన్ను కాపాడినందుకు చాలా థాంక్స్‌. నీ పేరు?” అనీ అడిగాను చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
”సార్‌, నా పేరు సహదేవ్‌. నేను బీఎస్సీ చదువుకున్నాను” అని చెప్పాడు.
”నీ పేరు ఎక్కడో చూసాను. నువ్వు బీఎస్సీ చదువుకున్నావు కదా, మరి ఉద్యోగం ఎందుకు చెయ్యటం లేదు?” అనీ అతన్ని అడిగాను.
”సార్‌, ఎన్నో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ ఒక్కదానిలో కూడా నేను ఎంపిక కాలేదు. మొన్న మీ కంపెనీకి కూడా ఇంటర్వ్యూ కి వచ్చాను. అప్పుడు మిమ్మల్ని చూసాను” అని చెప్పాడు సహదేవ్‌.
అతని మాట వినగానే నా మెదడులో ఒక మెరుపు మెరిసింది. అప్పుడు జరిగింది గుర్తుకు రాసాగింది. సహదేవ్‌ పేరుని ఈ మధ్యన మా కంపెనీలో జరిగిన ఇంటర్వ్యూలో చూసాను. సాధారణంగా ఈ పేరు ఎవ్వరూ పెట్టుకోరు. అందుకే ఆ పేరుని చూడగానే ఆ రోజు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు నాకు సహదేవుని ఆ రోజు ఇంటర్వ్యూలో చూసిన విషయం గుర్తుకు వచ్చింది.
ఆ రోజు సహదేవ్‌ ఇంటర్వ్యూలో మేమడిగిన ప్రశ్నలకు బాగానే సమాధానాలు చెప్పిన సంఘటన గుర్తుకు రాసాగింది. కానీ ఫైనల్‌ లిస్టులో సహదేవ్‌ పేరు మేం చేర్చలేదు. దానికి కారణం రాజకీయ ఒత్తిళ్లు. ఒక మంత్రి మా కంపెనీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి అతనికి చెందిన నలుగురికి ఉద్యోగాలు ఇమ్మనమని కోరడంతో సహదేవ్‌తో సహా ఎంపికైన నలుగురికి ఇవ్వకుండా ఆ మంత్రి గారి మనుషులకు ఇవ్వాలని మా ఎంపిక సంఘం సభ్యులు నిర్ణయించుకున్నాం. కానీ అదష్టవశాత్తూ రెండు రోజులు శలవులు రావడంతో ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. రేపు నేను ఆఫీస్‌కి వెళ్లి ఉత్తర్వులు మీద సంతకాలు చెయ్యాలి. ఈ లోగా ఈ సంఘటన జరిగింది.

ఆలోచనల్లోంచి బయటపడి ”సహదేవ్‌, నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు కతజ్ఞతలు. మంచి చేసిన వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది” అని అతనితో చెప్పి ఆ సాయంత్రం ఇంటికి వచ్చేశాను.

ఆ మర్నాడు నేను ఆఫీసుకి వెళ్లిన తరువాత పదకొండు గంటలప్పుడు ఆ ఇంటర్వ్యూల ఫైలు నా దగ్గరకు వచ్చింది. అందులో ఎవరెవరు కెమిస్టు ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. సహదేవ్‌ పేరు అందులో లేదు. కిందన ఇంటర్వ్యూ బోర్డులోని ఇద్దరి సభ్యుల సంతకాలు ఉన్నాయి. జనరల్‌ మేనేజర్‌గా నేను ఆ ఎంపిక చేసిన పేనల్‌ని ఆమోదించాలి. ఆమోదించిన తరువాత అందులో ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వబడతాయి.
నేను ఆ ఫైల్‌ని కొద్దిసేపు చూసి ఆ తరువాత మంత్రి గారికి చెందిన ఒక అభ్యర్థి పేరుని తొలగించి అతని స్థానంలో సహదేవ్‌ పేరుని చేర్చి ఎంపికైన ఆ పదిమంది అభర్ధుల నియామకాలను ఆమోదిస్తూ సంతకం చేసాను. ఆ సాయంత్రమే సహదేవ్‌తో సహా పదిమందికి నియామక ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి.
ఆ రోజు ఎంపికైనా సరే సహదేవ్‌కి ఉద్యోగం ఇవ్వలేక పోయినందుకు నా మనస్సు చాలా బాధ పడింది. కానీ ఈ రోజు మంత్రి గారి మనిషికి కాకుండా నన్ను కాపాడిన సహదేవ్‌కి ఉద్యోగం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా నాలో స్వార్ధానికి, మనస్సాక్షికి మధ్య సంఘర్షణ జరిగింది. కానీ ఆ సంఘర్షణలో మనస్సాక్షి గెలిచినందుకు నాకు చాలా ఆనందం కలిగింది.
రెండు రోజుల తరువాత సహదేవ్‌ నా ఛాంబర్‌కి వచ్చి తాను ఉద్యోగంలో చేరినట్లు చెప్పి నా కాళ్లకు దండం పెట్టబోతే నేను వారించి పంపించేసాను. అతను వెళ్లిపోతుంటే ఓ మంచి పని చేసినందుకు నా కళ్ళు చెమర్చసాగాయి.

  • గన్నవరపు నరసింహ మూర్తి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -