Wednesday, November 19, 2025
E-PAPER
Homeజాతీయం'ఉక్కు'ను తుక్కు చేసే కుట్రలు

‘ఉక్కు’ను తుక్కు చేసే కుట్రలు

- Advertisement -

ఉద్యోగులను తొలగిస్తూ ప్రైవేటీకరణ ప్రయత్నాలు తీవ్రతరం
ప్యాకేజీని అప్పులకు జమ చేసి సాయం చేసినట్టు బిల్డప్‌
రాష్ట్ర ప్రాజెక్టులకు సైతం రాయపూర్‌ ఉక్కు వినియోగం
విశాఖ :
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపైనా, అందులో పనిచేస్తున్న కార్మికులపైనా నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్కును తుక్కు చేసి కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టే కుయుక్తులు ముమ్మరమయ్యాయి. స్టీల్‌ప్లాంట్‌పైనా, కార్మికులపైనా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలు మాట్లాడారు. వాస్తవానికి రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్‌ప్లాంట్‌లో పెద్ద ఎత్తున కార్మికులను తొలగించబడ్డారు. ప్యాకేజీ పేరుతో ఇచ్చిన డబ్బంతా బ్యాంకులకు పన్ను బకాయిలుగా కేంద్ర బొక్కసానికి జమకట్టి ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేయబడ్డాయి.

ఏం జరుగుతోంది ?
కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీలో ఇంకా రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉంది. వచ్చిన డబ్బంతా బ్యాంకుల అప్పులకు, పన్నులకు జమ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను స్టీల్‌ యాజమాన్యం అమలు చేసింది. ఉత్పత్తికి కానీ, ప్లాంట్‌లో మరమ్మతులకు కానీ, వేతన బకాయిలకు కానీ ఒక్క పైసా కూడా వెచ్చించలేదు. ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించే నాటికి అంటే, 2021 జనవరి 27కు ప్లాంట్‌ రూ.916 కోట్ల లాభాల్లో ఉంది. గడిచిన నాలుగేళ్లలో రూ.10 వేల కోట్ల నష్టం వచ్చింది. కావాలనే నష్టాల పాలు చేసి తాము ఆదుకున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు పోతున్నాయి. 2,020 నాటికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులు. పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు కలిపి 28 వేల మంది వరకూ ఉండేవారు. ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత కార్మికుల సంఖ్య 20 వేలకులోపునకు వచ్చేసిందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అప్పట్లో రా మెటీరియల్‌ నాణ్యంగా వచ్చేది. ఇప్పుడు నాసిరకమైన రా మెటీరియల్‌ వస్తోందని అంటున్నారు. సొంత గనులూ లేవు. ఆరేళ్లుగా కార్మికుల రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. ఈ కారణాలన్నింటితో విశాఖ ఉక్కు నష్టాలబారిన పడుతోంది. నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పరిశ్రమల ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించు కున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించింది. దీపం వెబ్‌సైట్‌ నుంచీ ఆ సంస్థలను తొలగించింది. అక్కడి కార్మికుల, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మూలంగా ప్రైవేటీకరణ చర్యలు ఆగాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. గత వైసిపి, ప్రస్తుత టిడిపి ప్రభుత్వాలు కేంద్రంలోని మోడీ సర్కారుతో అంటకాగుతూ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేశాయి.

ప్యాకేజీ తర్వాత ఏం జరిగింది?
ప్యాకేజీ ఇచ్చామని చంద్రబాబు పదేపదే చెబుతున్నా టిడిపి కూటమి వచ్చాక 28 వేల మంది కార్మికుల్లో 1,600 మంది పర్మినెంట్‌ ఉద్యోగులను విఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపించేశారు. 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను అడ్డగోలుగా (ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కూడా చేయకుండా) తొలగించారు. ప్యాకేజీ నిబంధనల్లో భాగంగానే ఇదంతా జరిగింది.

స్థానికులను తీసేసి ఒడిశా, బీహార్‌ ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చి వారికి ఎలాంటి కనీస వేతనాలు, హక్కులు, భద్రతా లేకుండా పనిచేయించుకుంటున్నారు. పైపెచ్చు ఇక్కడ కార్మికులు ఇళ్లల్లో ఉండి జీతాలు తీసుకుంటు న్నారని, పనిచేయడం లేదని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సొంతగనులు ఉంటేనే స్టీల్‌ప్లాంట్‌ పురోగమిస్తుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులను కేటాయించి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై మాత్రం పాలకులు వివక్షత ప్రదర్శించారు. ఎన్‌ఎండిసి ఐరన్‌ ఓర్‌ను మిట్టల్‌కు కట్టబెడుతున్నారు. 2010లోనే ఎన్‌ఎండిసి నుంచి వైజాగ్‌ స్టీల్‌కు పైప్‌లైన్‌ ద్వారా ఐరన్‌ ఓర్‌ సరఫరా చేయాలనే ఒప్పందానికి తూట్లు పొడిచారు. దీంతో, ఐరన్‌ ఓర్‌తో పాటు పెల్లెట్స్‌ కోక్‌ను ప్లాంట్‌ బయట కొంటోంది. టన్ను రూ.3 వేలు కాగా రూ.5 వేలు అదనంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు వైజాగ్‌ స్టీల్‌ను వాడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రాయపూర్‌ నుంచి స్టీల్‌ను వాడుతోందని కేంద్ర ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ తెలిపారు. విశాఖ ఉక్కును తక్కుగా మార్చే ఈ కుట్రలను ప్రజల మద్దతుతో కార్మికవర్గం ప్రతిఘటిస్తోంది. ఇకపైనా ప్రజా ఉద్యమం కొనసాగితేనే కుట్రలను ఓడించడం సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -