Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగాన్ని మార్చే కుట్ర

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

- Advertisement -

బీజేపీ హయాంలో.. మహిళలకు రక్షణ లేదు
లింగ సమానత్వ సూచికలో అట్టడుగులో భారత్‌ : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వెన్షన్‌లో జాతీయ ఉపాధ్యక్షులు శిల్ప
మహిళలు ప్రపంచ విజేతలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు
నిజామాబాద్‌లో విద్యార్థినుల భారీ ప్రదర్శన, సభ

నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘దేశ వ్యాప్తంగా ప్రజలు ఒక వైపు రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంటే.. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు పన్నుతుంది. రాజ్యాంగం బదులు మనుస్మృతి అమలు చేయాలని చూస్త్తోంది. దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతుంటే వాటిని అరికట్టకుండా.. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని చూస్తుంది. దీనికి తోడు విద్యారంగానికి నిధులను తగ్గిస్తుండటంతో పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు’ అని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు శిల్ప అన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర గర్ల్స్‌ కన్వెన్షన్‌ రెండో రోజైన గురువారం విద్యార్థినుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు.

నగరంలోని ధర్నా చౌక్‌ నుంచి కోర్టు చౌరస్తా, ఖలీల్‌వాడీ నుంచి న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థినీలు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణంలో విద్యార్థి అమరులు భారతి, చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాను రాష్ట్ర గర్ల్‌ కన్వీనర్‌ పూజ ఆవిష్కరించారు. పూజ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో శిల్ప మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాలికలు, మహిళలపై దాడులు, లైంగికదాడులు, హత్యలు పెరిగాయని అన్నారు. వాటిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ మహిళలను వంటింటికే పరిమితం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగసమానత్వ సూచిలో భారత్‌కు 131 ర్యాంక్‌ రావడం దేశంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలుసుకోవచ్చని అన్నారు.

మహిళలు ప్రపంచ విజేతలు : నాగరాజు
ఎంత చదువుకున్నా.. ఆడపిల్లలు వంటగదికే పరిమితం కావాలని బీజేపీ భావిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు విమర్శించారు. మహిళా క్రికెట్‌ టీమ్‌ టీ20లో ప్రపంచ కప్‌ సాధించిందని, పహల్గాంలో ఉగ్రదాడి జరిగితే ప్రతి దాడికి నాయకత్వం వహించింది మహిళలేనని గుర్తుచేశారు. మహిళలు ప్రపంచ విజేతలని, ఇలాంటి ఘటనలు బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెంపపెట్టులాంటివని అన్నారు. మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందించినా.. పాలకులకు చుట్టాలుగా మారి నిందితులకు రక్షణ కల్పిస్తున్నాయని అన్నారు.

ఫోక్సో చట్టం, నిర్భయ, దిశ లాంటి చట్టాలున్నా అమలులో లోపాలతో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని తెలిపారు. విద్యార్థినుల, మహిళల హక్కుల కోసం, రక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని అన్నారు. ఈ బహిరంగ సభలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమ్య, నగర అధ్యక్షులు ఆజాద్‌ విప్లవ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మమత, కిరణ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు హేమలత, శ్రీహిజ, సంజన, మానస, మేఘన, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్‌, అధ్యక్షులు దీపిక, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -