తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కార్ దాడి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. సీబీఐ విచారణతో కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై దాడి చేయడం కాదనీ, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా ఎండబెట్టడమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోడీతో ఉన్నారని ఆరోపించారు. గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురే కారణమని తెలిపారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్‌ఎస్‌లను లేకుండా చేయడం ద్వారా తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగల్ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోడీ జేబు సంస్థలుగా మారాయన్న రేవంత్…48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వమంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే, రేవంత్ మాత్రం మోడీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్‌కు మాత్రం ముద్దొస్తుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ కోరగానే సీబీఐకి అప్పచెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కేసీఆర్ మీద విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షస ఆలోచనతో రేవంత్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలినప్పుడు, సుంకిశాలలో సైడ్‌వాల్ కూలితే, వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని గుర్తుచేశారు. అప్పుడు రాని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ, మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలోని నివేదిక ఇచ్చిందని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై మోడీ ఈగ కూడా వాలకుండా కాపాడుతున్నారని తెలిపారు. పద్నాలుగేండ్ల ఉద్యమంలో, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో, రెండేండ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా కేసీఆర్, బీఆర్‌ఎస్ నిలుస్తున్నదని తెలిపారు. ఆ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్. సీబీఐకే కాదు…ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్‌ఎస్ పార్టీ భయపడదని పేర్కొన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్‌లో మంతనాలు
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మాజీమంత్రులు హరీశ్‌రావు,జగదీశ్‌రెడ్డి తదితరులు భేటీఅయ్యారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత..కవిత వ్యాఖ్యలు తదితర అంశాలను చర్చించినట్టు సమాచారం.
సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES