మాజీ మంత్రులు, నాయకులు
ఇందిరాపార్కు వద్ద లంబాడీల ఆత్మగౌరవ సభ
నవతెలంగాణ – ముషీరాబాద్
రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రులు, పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘లంబాడీల ఆత్మగౌరవ సభ’ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ప్రక్రియలో భాగంగా లంబాడీలను ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ ఆక్ట్ 108/1976 ద్వారా జాబితాలో చేర్చినట్టు చెప్పారు. స్వాతంత్య్రం రాకముందే లంబాడీ బంజారా ప్రజలను గిరిజన తెగలుగా గుర్తించారని తెలిపారు. నిజాం కాలంలోనే చేసిన జనగణనలో లంబాడీలను గిరిజనులుగా గుర్తించిన వాస్తవాలని తెలుసుకోవా లని, చరిత్ర తెలియకుండా కొంతమంది దుష్ప్ర చారం చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ.. కలిసి జీవిస్తున్న లంబాడీ తెగ.. మిగతా తెగలకు మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారన్నారు. కొంతమంది కార్పొరేట్ శక్తులు, వాళ్ల వెనుక ఉన్న రాజకీయ నాయకుల కుట్రలను మిగతా తెగలు అర్థం చేసుకోవాలని, వాటిని తిప్పి కొట్టాలని కోరారు.
ఈ సభలో పలు తీర్మానాలను చేశారు. రాబోయే రోజుల్లో లంబాడీ ప్రజలను చైతన్యం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి తండాకూ బస్సు యాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడి ప్రజాప్రతినిధులకు చోటు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి లంబాడి, ఇతర తెగలకు మధ్యన జరుగుతున్న గొడవను పరిష్కరించాలని, వెంటనే ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడాలని తీర్మానించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన జాటోత్ టానునాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో లంబాడీ గిరిజన హక్కుల కోసం హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్‌సింగ్, మాజీ ఎంపీలు ప్రొఫెసర్ సీతారాం నాయక్, కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, తెగ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రనాయక్, సభ సమన్వయకర్తలు కరాటే రాజు నాయక్, నెహ్రూ నాయక్, సంపత్ నాయక్, శరత్ నాయక్, రవీందర్ నాయక్, సుబ్బు నాయక్, నాము నాయక్, అశోక్ నాయక్, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.