ఈ స్కీములను ప్రయివేటుకు ఇవ్వటమేంటి?
సెస్ నిధులు దుర్వినియోగమవుతున్నా..పట్టించుకోరా..?
జీవో 12ను సవరించాలి…సహజ మరణానికి రూ. ఐదు లక్షలివ్వాలి
సీఎస్సీ హెల్త్త్ టెస్టులు రద్దు చేయాలి : సీడబ్ల్యూఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఎం. సాయిబాబు
హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కార్మికుడి కష్టంతో పెద్దపెద్ద భవనాలు నిర్మాణమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సీఎం, మంత్రుల క్యాబిన్ల వరకు అన్నీ వారి స్వేదంతోనే తయారవుతున్నాయి. మెట్రో నిర్మాణం నుంచి కార్మికశాఖ ఉన్నతాధికారులు కూర్చునే భవంతులన్నీ.. కార్మికుల రెక్కల కష్టంతో నిర్మితమె ౖనవే.. అలాంటి కష్టజీవుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగునా?’ అంటూ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్‌ఐ) అఖిల భారత అధ్యక్షులు ఎం సాయిబాబు ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్(సీడబ్ల్యూఎఫ్‌ఐ-సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
‘భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం సిగ్గు సిగ్గు, జీవో 12ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలి, సహజ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి, సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలి, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్), సీఐటీయూ జిందాబాద’్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, ప్రజాపాలన అందిస్తామని నమ్మబలికిందని అన్నారు. అధికారంలోకొచ్చిన తర్వాత భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగమవుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణ బీమా, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం న్యాయమా? అని నిలదీశారు. రూ.346.36 కోట్లను క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నిం చారు. కార్మికులకు ఉపయోగం లేని సీఎస్సీ హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. అవసరమున్నా, లేకున్నా ప్రతి కార్మికుడి పేరు మీద రూ.2,309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే సీఎస్సీ హెల్త్ టెస్ట్ పేరుతో రూ.500 కోట్లు కాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణరంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యానికి కుట్రలు చేస్తున్నదని వివరించారు. ఆ ఆలోచనను మానుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
అనంతరం కార్మికులు గేటు వద్దకు వెళ్లి లేబర్ కమిషనర్ బయటకు రావాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జేసీఎల్ ప్రమోద్ రెడ్డి బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, సీఐటీయూ ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్‌రావు, సీఐటీయూ సౌత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మీనా, శ్రావణ్‌కుమార్, యూనియన్ కార్యదర్శి లక్ష్మినారాయణ, నాయకులు జి నరేశ్, శ్రీశైలం, లక్ష్మయ్య, వెంకన్న, సోములు, యలక సోమయ్య, నరేష్, భిక్షపతి, లక్ష్మీనారాయణ, జ్యోతి, పార్వతి, రాధ తదితరులు పాల్గొన్నారు.



