నవతెలంగాణ – ధర్మసాగర్
నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని ఎమ్మెల్యే గడియం శ్రీహరి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక లో ఉమ్మడి మండలాలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..21నెలలలో 1026కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానన్నారు. రానున్న 3ఏళ్లలో మరో రూ.2వెల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ అభివృద్దే ఏకైక సంకల్పంగా పని చేస్తానని అన్నారు.
ఈ సందర్బంగా వేలేరు మండలానికి సంబందించిన 13మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.13లక్షల 01 వేయి 508 విలువగల చెక్కులను 19మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు, రూ.5లక్షల 77వేల విలువగల చెక్కులను అలాగే ధర్మసాగర్ మండలానికి సంబందించిన 21మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, రూ. 21 లక్షల 02వేయి 446 విలువగల చెక్కులను, 41మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.12లక్షల 38వేల విలువగల చెక్కులను పంపిణి చేశారు. అధికారంలో ఉన్ననాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఈ రోజు పాదయాత్రలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిందే బిఆర్ఎస్ అని ఆరోపించారు. నన్ను రాజీనామా చేయమనే హక్కు బిఆర్ఎస్ కు లేదని, ఆనాడు బిఆర్ఎస్ లో చేరిన 36మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా నేను ఎందుకు రాజీనామా చేయాలి, రాజీనామా చేయడం వల్ల దేనికి ఉపయోగమని ప్రశ్నించారు. రానున్న 3ఏళ్లలో మరో 2వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి సదానందం,ఎంపీడివో అనిల్ కుమార్, ఏవో రాజేష్, ఇతర అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.