Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనిర్మాణాలు కొనసాగించొచ్చు

నిర్మాణాలు కొనసాగించొచ్చు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో నమిత్‌ హౌమ్స్‌ నిర్మాణం చేసే 25 అంతస్తుల 360 లైఫ్‌ కట్డడాలకు హైకోర్టులో అడ్డంకి తొలగిపోయింది. బహుళ అంతస్తుల నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీ అభ్యంతరాలను సరిచేయాలంది. నమిత హౌమ్స్‌కు అనుమతులను తిరిగి ఇస్తూ గత జూన్‌ 11న జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ను నిర్మాణ సంస్థ పార్టనర్‌ విజరుకుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. గత విచారణలో జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఆ మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ జీహెచ్‌ఎంసీ అనుమతుల మేరకు నిర్మాణం చేపట్టాలని తాజాగా ఆదేశించి విచారణను వాయిదా వేశారు.
విమాన ఇంధనంలో కల్తీపై ఆగ్రహం
విమాన ఇంధనాన్ని కల్తీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగితే ప్రయాణికుల ప్రాణాలు ఏం కావాలని నిలదీసింది. కాంట్రాక్టు రద్దును సవాల్‌ చేయడాన్ని తప్పుపట్టింది. పిటిషనర్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ రద్దు అన్యాయమంటూ గుర్నాధం వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. రూ.10 లక్షల జరిమానా విధించారు.
గత ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు? :ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లపై హైకోర్టు
విద్యా, ఉపాధి రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల అంశంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్లకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, ఆసరా పింఛన్లు కల్పించాలనే పిటిషన్‌ను హైదరాబాద్‌కు చెందిన వై.జయంతి వసంత మొగిలి 2023లో పిటిషన్‌ వేశారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. గత ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని సీఎస్‌తోపాటు సాంఘిక సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.
పీపీ భర్తీ చర్యలు చెప్పండి
రాష్ట్రంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం చేస్తామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా నోటిఫికేషన్‌ను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీపీ పోస్టులను భర్తీ చేయకపోవడంపై బి.శ్రీనివాసులు పిటిషన్‌ వేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది.118 ఏపీపీ పోస్టుల నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిందనీ, నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై హైకోర్టు వెలువడబోయే నోటిఫకేషన్‌ను సమర్పించాలని ఆదేశించింది. విచారణను వారానికి వాయిదా వేసింది.
హైకోర్టులో సీఎంకు ఊరట
అనుమతిలేకుండా ర్యాలీలో పాల్గొన్నారని ఎంపీగా ఉండగా రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని 2021లో కాంగ్రెస్‌ పార్టీ సచివాలయం నుంచి రాజ్‌భవన్‌వరకు ర్యాలీ నిర్వహించింది. దీనిపై నమోదైన కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఆదేశాలను జారీ చేశారు. విచారణను అక్టోబరు 7కు వాయిదా వేశారు.
కేటీఆర్‌కు హైకోర్టు ఊరట
అమృత టెండర్‌ కేటాయింపులపై చేసిన విమర్శల నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల రామారావుకు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని జస్టిస్‌ లక్ష్మణ్‌ మంగళవారం విచారించారు. కింది కోర్టులో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శోధ కన్‌స్ట్రక్షన్‌పై ఆరోపణలు చేసిన విషయంలో ఆ సంస్థ యజమాని సూదిని సృజన్‌ ఇచ్చిన ప్రయివేటు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్‌ పిటిషన్‌ వేశారు. ఇందులో ప్రతివాదులైన ప్రభుత్వానికి, ఫిర్యాదుదారుకు నోటీసులను జారీ చేసిన న్యాయమూర్తి విచారణను అక్టోబరు ఏడో తేదీకి వాయిదా వేశారు.
జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికను నిలిపివేయండి : నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషి పిటిషన్‌
నేడు విచారణ చేయనున్న హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ నీటి పారుదల శాఖ గత ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి పిటిషన్‌ దాఖలు చేశారు. ‘తనపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.
కమిషన్‌ నివేదికను రద్దు చేయాలి. సాక్షిగా పిలిచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న కమిషన్‌ కావాలని కేసులో ఇరికించింది. ఆరోపణలు చేసే ముందు విచారణ కమిషన్‌ చట్టం ప్రకారం 8(బి), 8(సి) కింద నోటీసులు ఇవ్వలేదు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం’ అని దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషన్‌లను చేర్చారు. దీనిపై బుధవారం హైకర్టు విచారణ చేయనుంది.
ఎస్‌బీఐపై హైకోర్టు ఆగ్రహం
రుణానికి సంబంధించి రైతులు మాధవర్‌రెడ్డి, ఎన్‌.బాల్‌రెడ్డిలకు అనుకూలంగా డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఏడేండ్లకు అప్పీల్‌ దాఖలు చేసిన ఎస్‌బీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆలస్యంగా పిటిషన్‌ వేయాల్సివచ్చిందో బుధవారం చెప్పాలని ఎస్‌బిఐని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ జి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన డివిజ న్‌ బెంచ్‌ ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad