– 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి : తెలంగాణ భవన నిర్మాణ కార్మిక
సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక చట్టాలను సంరంక్షించాలనీ, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భవన నిర్మాణ కార్మికులు జయప్రదం చేయాలని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ రోజు పనులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం 1996, అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, కాంట్రాక్టు కార్మికుల చట్టం-1970తో పాటు ఇతర కార్మిక చట్టాల రక్షణ కోసం కొట్లాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఆర్టీయూ, బీఎన్‌ఆర్‌కెఎస్, స్ఫూర్తి, ఐఎఫ్‌టీయూ యూనియన్లకు భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అందులో వంగూరు రాములు, ఆర్.కోటంరాజు, ఎ.రాజు, కె.జంగయ్య (సీఐటీయూ), ప్రవీణ్‌కుమార్, రమేశ్(ఏఐటీయూసీ), అనురాధ(ఐఎఫ్‌టీయూ), విజరు, సరళ (ఐఎఫ్‌టీయూ), నారాయణ(బీఆర్టీయూ), కామెళ్ల ఐలన్న(బీఎన్‌ఆర్‌కేఎస్), కుమార్, చంద్రమౌళి (స్ఫూర్తి) తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకురాబోయే నాలుగు లేబర్ కోడ్‌లు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నియమించాలనీ, బోర్డులోని నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అన్నిరకాల నిర్మాణాల పనుల వద్ద ప్రమాదాలలో గాయపడి, మరణించినా నష్టపరిహారాలు అందుతున్నాయనీ, లేబర్ కోడ్‌లు అమలైతే 12 అడుగుల ఎత్తు లోపు నిర్మాణాల వద్ద, భవనాల్లో రిపేర్లు, మార్పులు, చేర్పుల పనులకు, చమురు, గ్యాస్ సంస్థల నిర్మాణాల్లో పనిచేసే కార్మికులకు ఈ చట్టం వర్తించదని వివరించారు. సెస్ నిధుల వసూళ్ళలో మార్పులు చేస్తూ యజమాని చెప్పిన విధంగానే వసూలు చేయాలనీ, సెస్సు వసూలు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల పైబడిన నిర్మాణాల నుండే వసూలు చేయాలని కోడ్‌లలో పొందుపర్చారని తెలిపారు. 10 మందికి పైన పనిచేసే చోట మాత్రమే కార్మికుడు చనిపోతే చట్టం వర్తించేలా కోడ్‌లో పొందుపర్చారని వివరించారు. నిర్మాణాల్లో వాడే ముడి సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుల ఇండ్ల నిర్మాణాలు తగ్గిపోయాయనీ, ఫలితంగా కార్మికులకు చేతినిండా పని దొరక్క అడ్డాల వద్ద పనుల కోసం ఎదురుచూస్తున్న స్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు నుంచి కార్మికులకు ఇవ్వవలసిన నష్టపరిహారాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదనీ, బోర్డులో పైరవీకారులు, బ్రోకర్ల ప్రభావాన్ని అరికట్టాలని కోరారు. వెల్ఫేర్ బోర్డుకు రూ.6 వేల కోట్ల సెస్ వసూలైతే కార్మికులకు ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమేననీ, మిగతావి ఇతర పథకాలకు మళ్లించారని విమర్శించారు. ఈ నెల 4, 5 తేదీల్లో సైకిల్ ర్యాలీలు చేపట్టాలనీ, 6, 7, 8 తేదీల్లో పని ప్రదేశాల్లో విస్తృత ప్రచారాలు చేయాలని పిలుపునిచ్చారు. 9న జరిగే సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు జరిగే ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.