– గ్రంథాలయ శాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలు
– అమలు చేయకపోవటంతో హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : గ్రంథాలయ శాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలు చెల్లించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్టేట్ చీఫ్ సెక్రటరీ కె.రామకష్ణరావు పాటు ఇద్దరు ఐఏఎస్‌లకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 24న వ్యక్తిగతంగా హాజరుకావాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణరావు (ఇప్పుడు సీఎస్) పబ్లిక్ లైబరీస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారిలను ఆదేశించింది. జీవో నంబర్ 841, 33 ప్రకారం గ్రంథాయల గ్రేడ్-3 ఉద్యోగులతో సమానంగా పార్ట్‌టైం స్వీపర్లకు వేతనాలు అందించాలని 2024, డిసెంబర్ 19న ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ స్వీపర్లు హేమలత ఇతరులు పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ నగేష్ భీమపాక విచారించి ముగ్గురు ఐఏఎస్‌లు కోర్టుకు రావాలని నోటీసులు ఇచ్చారు.
హేచరీలతో ప్రజలకు మేలు ఏమిటి?
వికారాబాద్ జిల్లా దరూర్ మండలం అంతరం సర్వే నంబర్ 32, 82లో హేచరీ నిర్మాణానికి ఆరు ఎకరాలు కేటాయించాలన్న వినతిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారించారు. హేచరీ పెట్టడం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగమని, ఎందుకు భూమి కేటాయించాలని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన భూపంపిణీలే సజావుగా లేవని, అనర్హులకు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తే ప్రభుత్వానికి పంపలేదని పిటిషనర్ చెప్పారు. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు.
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై సర్కార్‌కు నోటీసులు
రాజేంద్రనగర్ మండలం హైదర్‌గూడ ఉప్పర్‌పల్లిలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే పిల్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, వాటిపై ప్రభుత్వం రెండు వారాల్లో రిప్ల్కె కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఉప్పర్‌పల్లిలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవడం లేదంటూ ఎరబ్రోడ వీకర్ సెక్షన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శ్రీధర్‌రెడ్డి పిల్ వేశారు. దీనిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోరుపాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం సోమవారం విచారించింది.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, తహసీల్దార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్‌లో అనధికార ప్రతివాదులకు నోటీసులు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నంబర్ 27లోని 27.18 ఎకరాల భూమి సర్వే నెంబర్లను మార్చేసి భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేస్తున్నారంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారించింది.
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మురళీనాయక్ భూక్యా, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ల రాజేష్ రెడ్డి వేసిన పిటిషన్‌లోని ప్రయివేట్ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. పిటిషనర్ చెబుతున్న భూమిలో జరిగే ‘హైరైజ్’ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నంబర్ 27లోని 27.18 ఎకరాల సర్కార్ భూమిలో ప్రయివేట్ వ్యక్తులు పెద్దెత్తున టవర్లు నిర్మిస్తున్న వాటిపై చర్యలు తీసకోవాలని అధికారులకు గత నెల చివర్లో వినతిపత్రాలు ఇచ్చామని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అధికారుల నుంచి చర్యలు లేవని, అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు దీంతో అనధికారిక ప్రతివాదులు సికిందర్ ఖాన్, సలాబత్ ఖాన్, పల్లవి, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, బండి బింధులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేస్తూ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోరుపాల్, జస్టిస్ రేణుకాయారా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్ 1పై జడ్జిమెంట్ రిజర్వు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ తప్పులు చేసిందంటూ దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఏప్రిల్ నుంచి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. గత విచారణ సమయంలో గ్రూప్-1 నియామకాలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గత ఏప్రిల్ 17న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు సోమవారం ప్రకటించారు.
రేవంత్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం ఏ. రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు కింది కోర్టులోని కేసు విచారణలో ఉంది. దీనిని కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వు చేసింది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రిజర్వేషన్ల అంశంపై చేసిన ప్రసంగం బీజేపీ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందంటూ ఆపార్టీ నేత వెంకటేశ్వర్లు కింది కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇది నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన ఈ కేసు కొట్టివేయాలని రేవంత్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేశారు.