9న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలు చేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఫాం-1 నోటీసులను జారీ చేసింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆదేశించారు. జనవరి 9న జరిగే విచారణకు హాజరై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఫాం-1 నోటీసులు జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సుందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం, కరీంనగర్ రీజియన్ ఎస్‌ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావు స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. స్వయంగా హాజరు నుంచి వినహాయింపు కోరేందుకు ఏవిధమైన అభ్యర్థనలు చేయవద్దని తేల్చి చెప్పారు. సివిల్ పనులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ కె.ఆనంద్ అండ్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషనర్‌కు ‘బకాయి రూ.1.16 కోట్లపై చిలుకు మొత్తాన్ని ఆరు వారాల్లో చెల్లించాలి…’ అని గత ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశించింది. మూడు మాసాలైనప్పటికీ బకాయి చెల్లించలేదంటూ పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వేశారు. న్యాయవాది డీఎల్ పాండు వాదిస్తూ, అధికారులు కావాలనే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, బకాయిలు చెల్లింపులు చేయలేదని చెప్పారు. బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గత విచారణకు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, కరీంనగర్ జిల్లా ఎస్‌ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హాజరై కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసింది.కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఇది నిర్లక్ష్యం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. అధికారులు జూలై 11, ఆగస్టు 14, ఆగస్టు 29, సెప్టెంబర్ 19, అక్టోబర్ 16, నవంబర్ 3, నవంబర్ 7, నవంబర్ 21న జరిగిన విచారణలకు స్వయంగా హాజరైనప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీసింది. పైవిధంగా అధికారులను ఆదేశించి, విచారణ జనవరి 9కి వాయిదా వేసింది.
453 సేల్‌డీడ్స్ రద్దు చెల్లదు : కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూముల సేల్‌డీడ్‌లను కలెక్టర్ రద్దు చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కలెక్టర్ తీసుకున్న చర్యలను రద్దు చేసింది. గత మేలో 453 సేల్‌డీడ్‌లను కలెక్టర్ రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన సుమారు 35 పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ లోకాయుక్తకు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ నియమాలు-2016లోని రూల్ 243 కింద కలెక్టర్ ఆ సేల్‌డీడ్‌లు రద్దు చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ హనుమాజీపల్లికి చెందిన లింగాల పద్మ ఇతరులు 35 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లకు నోటీసులు కూడా జారీ చేయకుండా, వారి వాదనలు వినకుండా కలెక్టర్ ఏకపక్షంగా సేల్‌డీడ్స్‌ను రద్దు చేయటాన్ని పిటిషన్ తరపు లాయర్ తప్పుబట్టారు. కాగా భూములను సెక్షన్ 22ఏ పరిధిలోకి తీసుకురాలేరంటూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారు. ఈ ఉత్తర్వు కాపీని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఇదీ నేపథ్యం
ఈ భూముల వివాదం 1975 ఏడాది నుంచి కొనసాగుతోంది. షేక్ సలేహ్, ఇతర కుటుంబసభ్యులు సీలింగ్ చట్టం కింద కొత్తపల్లి రేకుర్తి గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలోని మిగులు భూములుగా ప్రకటించారు. అయితే, అది మోసపూరిత ప్రకటన అని 1998లో అధికారులకు ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని రిజిస్ట్రేషన్ చేయరాదని ఆర్డీవో ఉన్నతాధికారికి 1996లో లేఖ రాశారు. ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని 2017లో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అవి ప్రభుత్వ భూములని పేర్కొంటూ కలెక్టర్ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. కలెక్టర్ నిర్ణయాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు.
పిటిషనర్ల వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చింది. ఇదే సమయంలో నిషేధిత భూములకు సంబంధించి చట్ట ప్రకారం 22ఎ కింద చేర్చేముందు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు వింజమూరి రాజగోపాలదారి కేసులో ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ప్రస్తావించారు. సెక్షన్ 22ఎ వ్యవహారంపై రెండు డివిజన్ బెంచ్‌లు రెండు వేర్వేరు తీర్పులు చెప్పిన అంశాన్ని ఉదహరించారు. ఒకే అంశంపై సింగిల్ జడ్జిలు వేర్వేరు తీర్పులు చెప్పిన వ్యవహారం చీఫ్ జస్టిస్‌కి నివేదించాలని చెప్పారు. ఇక్కడ రెండు డివిజన్ బెంచ్‌లు వేర్వేరు తీర్పు చెప్పారని, దీన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
స్వీపర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ చేయండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పంచాయతీరాజ్ శాఖలో గత 30 ఏళ్లుగా స్వీపర్లుగా చేస్తున్న 39 మంది సర్వీస్‌లను రెగ్యులరైజ్ చేయాలని, స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి వాళ్ల సర్వీసును లెక్కించి, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లను చెల్లించాలని పేర్కొంటూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గత 30 ఏళ్లుగా స్వీపర్‌గా చేస్తున్న తమను అటెండర్ లేదా నైట్ వాచ్‌మెన్ పోస్టుల్లో భర్తీ చేయాలన్న వినతులపై అధికారులు స్పందించలేదంటూ అశోక్, ఇతరులు వేసిన పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల పైవిధంగా తీర్పు వెలువరించారు. స్వీపర్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని చివరి గ్రేడ్ అయిన అటెండర్, వాచ్‌మెన్ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ పిటిషనర్లు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి సానుకూల స్పందన లేదు.
మూడు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న పిటిషనర్లను (39 మంది స్వీపర్లు) ఖాళీల్లో చట్టప్రకారం రెగ్యులరైజ్ చేయలేదు. సుప్రీం కోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన తీర్పును, హైకోర్టు తీర్పులను అధికారులు అమలు చేయడం లేదని నల్లగొండ జిల్లా చండూర్ మండలం శేరిగూడెం పీఎస్ స్వీపర్ రవితోపాటు మరో 38 మంది వేసిన పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. ఈ అంశాన్ని విచారించిన న్యాయమూర్తి క్రమబద్దీకరణ సమయంలో పిటిషనర్లు విధుల్లో చేరిన నాటి నుంచి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిటిషనర్ల నుంచి తిరిగి వినతిపత్రాలను స్వీకరించి 39 మంది స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెక్కించి, వేతన ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లను చెల్లించాలని తీర్పు చెప్పారు.
దేవల్ బాలాజీ భూములపై తీర్పు
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మల్కాపూర్‌లోని సర్వే నంబర్ 10, 29, 31, 33, 230 నుంచి 238, 273, 274, 275, 366లోని 77.30 ఎకరాలు దేవల్ బాలాజీ (బాలాజీ వెంకటేశ్వర స్వామి) ఆలయానివేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ఆర్డీవో ఇవ్వడాన్ని జాయింట్ కలెక్టర్ సమర్ధించడాన్ని ఆమోదించింది. భూములపై హక్కులు ఉన్నాయని వాదించే పిటిషనర్లు ఈ వ్యవహారాన్ని ఎండోమెంట్స్ ట్క్రెబ్యునల్‌లో తేల్చుకోవాలని ఆదేశించింది శేరి నారాయణరెడ్డి, మరో 21 మంది వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ తీర్పు చెప్పారు.



