అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నేతలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీజేఐగా తాను రిటైర్ అయినంత మాత్రానా… సుప్రీంకోర్టు బంద్ కాదని సీజేఐ బీఆర్ గవాయి పేర్కొన్నారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వ్యవహారంలో ఈ ఏడాది జులై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదని పేర్కొంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, కల్వకుంట్ల సంజరు, చింత ప్రభాకర్, తదితరులు సోమవారం సుప్రీంకోర్టులో రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. గత ఆదేశాలను అమలు చేయనందున సుప్రీంకోర్టునే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రిట్ పిటిషన్, అలాగే ఆదేశాల అమలులో జాప్యంపై స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు.
గత ఆదేశాలను స్పీకర్ కార్యాలయం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని రిట్ పిటిషన్‌లో పొందు పరిచినట్టు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో కనీసం ఒక్క ప్రొసీడింగ్ కాలేదని, 100 రోజులు గడిచిన వారిపై చర్యలు తీసుకోకపోవడం గత తీర్పు వ్యతిరేకమని, అందువల్ల స్పీకర్‌పై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రెండు పిటిషన్ల గురించి బీఆర్‌ఎస్ నేతల తరపు న్యాయవాది మోహిత్ రావు సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఈ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు. ‘స్పీకర్ ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ పది మంది ఇప్పటికీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.
ఏ ఎమ్మెల్యే విచారణను కొనసాగించాలని చూసినా స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని గత ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. అయితే…. కీలకమైన దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో స్పీకర్ కనీసం స్పందించలేదు. మిగిలినవి ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.’ అని మోహిత్ రావు కోర్టుకు నివేదించారు. అలాగే… ‘ఈ నెల 24న సీజేఐగా మీరు రిటైర్డ్ అవుతున్నందున. అప్పటి వరకు ఈ పిటిషన్లు బెంచ్ ముందు విచారణకు రాకుండా లాగాలని చూస్తున్నారు’ అని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ…’అత్యవసర విచారణకు నిరాకరిస్తున్నాం. వచ్చే వారం ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపడతాం.
ఒకవేళ నేను సీజేఐగా రిటైర్డ్ అయినా… నవంబర్ 24 తరువాత సుప్రీంకోర్టు బంద్ (మూసీ వేయబడదుగా) కాదుగా’ అని వ్యాఖ్యానించారు. కాగా… పార్టీ ఫిరాయింపుల అంశంలో రెండు నెలలు (ఎనిమిది వారాల) గడువు కావాలని గత నెల స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో మిస్ లీనియస్ అప్లికేషన్ (ఎంఏ) దాఖలు చేసింది. ఈ అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈనెల 14న విచారణ జాబితాలో చేర్చారు. దీంతో ఆరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిగే ఆస్కారం ఉందని తెలిసింది.
అసెంబ్లీ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
- Advertisement -
- Advertisement -



