Saturday, January 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు2029 ఎన్నికల్లో పోటీ

2029 ఎన్నికల్లో పోటీ

- Advertisement -

సామాజిక తెలంగాణే నా ధ్యేయం
నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకందాలి
యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి
అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్‌ పాలన అట్టర్‌ప్లాప్‌
ఎక్స్‌వేదికగా నెటిజన్లతో కవిత ఇంటరాక్షన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో తాము పోటీచేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సామాజిక తెలంగాణనే తమ ధ్యేయమని మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని నొక్కిచెప్పారు. సోమవారం ఎక్స్‌వేదికగా ‘ఆస్క్‌ కవిత’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. యువత, మహిళలు నచ్చిన రంగాల్లో రాణించాలన్నారు. వారికి రాజకీయాలు అవకాశాలు కల్పించాలనీ, ఆ దిశగా తాము కృషి చేస్తామని హామీనిచ్చారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామని తెలిపారు.

తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే రోజులు రావాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగాలు కల్పించటంతో పాటు భద్రత కల్పించడం తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. విస్తరణలో భాగంగా త్వరలోనే జాగృతి సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తమ జాగృతి కమిటీల్లో అన్ని సామాజిక తరగతులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రేవంత్‌ పాలన ఎలా ఉందన్న నెటిజన్ల ప్రశ్నకు స్పందిస్తూ..ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని విమర్శించారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్‌ పాలనపై అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు.

రైతు ఆత్మహత్యలు పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్‌ సిటీ అంటూ హడావుడి చేయటాన్ని తప్పుబట్టారు. ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని ప్రకటించారు. హెచ్‌ఎంఎస్‌తో కలిసి సింగరేణి కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం సరిగాదని తెలిపారు. వెస్ట్‌సిటీపై పెట్టిన శ్రద్ధను ఈస్ట్‌సిటీ అభివృద్ధిపైనా చూపాలని సూచించారు. రామ్‌ చరణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా…చాలా హంబుల్‌గా ఉండే వ్యక్తి అనీ, మంచి డ్యాన్సర్‌ అని కొనియాడారు. అయితే, తాను చిరంజీవి అభిమానిని అని స్పష్టం చేశారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్‌లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయన్నారు. సోమవారం ట్విట్టర్‌ (ఎక్స్‌) పాలిటిక్స్‌ విభాగంలో ఈ ఇంటరాక్షన్‌ నంబర్‌వన్‌గా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -